Thursday, May 9, 2024

అవినీతి, కుటుంబ పాలన అంతమే బీజేపీ పంతం.. బీజేపీ నేత లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న కుటుంబ, అవినీతి పాలనను అంతమొందిస్తామని ప్రజలకు చెప్పేందుకే జూలై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బహిరంగసభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్‌ షాతో పాటు 18 రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతున్నందున ఈ సమావేశాలు చారిత్రాత్మకం కానున్నాయన్నారు.

130 కోట్ల దేశ ప్రజల సంపూర్ణ మద్దతు తెలంగాణకు ఉంటుందని నమ్ముతున్నామన్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ హైదరాబాద్‌లో వైస్రాయ్‌ హోటల్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే సభకు విజయ్‌ సంకల్ప్‌ సభ అని నామకరణం చేశామన్నారు. అధర్మంపై ధర్మం, అన్యాయంపైన న్యాయం గెలవడం కోసమే ఈ పేరును ఖరారు చేశామన్నారు. కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకొని కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చివరకు ఫ్లెక్సీ రాజకీయాలు చేసే స్థాయికి కేసీఆర్‌ దిగజారిపోయారని పేర్కొన్నారు.

జులై 1న సాయంత్రం గం. 4 లకు శంషాబాద్‌ పట్టణంలో కిలోమీటరు మేర జేపీ నడ్డాకు స్వాగతం పలుకుతూ రోడ్‌ షో నిర్వహిస్తామని, రాత్రి గం. 7 లకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశమవుతారని తెలిపారు. రాత్రి గం. 8.30 లకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. బీజేపీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో బీజేపీ ఎలా ఎదిగింది, ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుందన్న అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాట ఘట్టాలను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌, 8 ఏండ్ల మోడీ పాలనపై ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నామన్నారు.

జులై 2న ఉదయం గం. 10లకు జాతీయ పదాధికారులతో జేపీ నడ్డా సమావేశమవుతారని వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు కార్యవర్గ సమావేశాలను జేపీ నడ్డా ప్రారంభిస్తారని. 3న కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశాల విజయవంతం కోసం 34 కమిటీలు పని చేస్తున్నాయని గుర్తు చేశారు. తెలంగాణకు సంబంధించిన సకినాలు, జొన్నరొట్టె, సర్వపిండి, మడుగులు, గారెలు ప్రతినిధులకు అందిస్తున్నామన్నారు. సమావేశాలకు అక్కడక్కడా కొందరు కావాలని ఇబ్బందులు కలిగిస్తున్నారని, అయినప్పటికీ ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. హోర్డింగ్‌ల ఏర్పాటు విషయంలో కేసీఆర్‌ది చౌకబారుతనమని, మాకు ఛాన్స్‌ ఇవ్వకూడదని అన్ని బ్లాక్‌ చేశారని మండిపడ్డారు. అధికారం, డబ్బును అడ్డు పెట్టుకుని ఇలా చేయడం సరికాదన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement