Tuesday, May 7, 2024

MBNR : కాంగ్రెస్ ది ప్ర‌జా ప్ర‌భుత్వం… ఎమ్మెల్యే యెన్నేం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,డిసెంబర్ 10 (ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ నియోజకవరర్గంలో ఇకనుంచి రాజకీయాలకతీతంగా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ తన క్యాంపు కార్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఆదివారం ఎమ్మెల్యే పట్టణంలోని తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా సేవకుడిలా పని చేస్తానని పేర్కొన్నారు.ఇకనుంచి నియోజకవర్గ ప్రజలు తమకు నచ్చినట్టుగా ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారైనా పార్టీలకతీతంగా స్వేచ్ఛగా తమ పనులు తాము చేసుకోవచ్చు అని తెలిపారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించే హక్కు ను రాజ్యాంగం కల్పించిందని,ఈ రోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ప్రారంభించు కోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పార్టీ లకు అతీతంగా ఎవరైనా సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావచ్చని ఆయన పిలుపునిచ్చారు. నిన్నటి వరకే రాజకీయాలుని ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధి నినాదంతో అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి బాటలు వేసి మహబూబ్ నగర్ ను అభివృద్ధి కి ఐకాన్ గా మార్చుకుందాం అని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో లాగా నియోజకవర్గంలో ఎలాంటి విధమైన ప్రతికార చర్యలు ఉండవని, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోరే పార్టీ అని ప్రజల ముందుకు సంక్షేమాన్ని తీసుకెళ్లడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.ముఖ్యంగా ప్రజలు,అధికారులు అందరూ చట్టానికి లోబడి పని చేయాలని, సమస్యలు కావాలని సృష్టించిన వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలంతా ఏ సమస్య వచ్చిన స్వయంగా ఈ ప్రజా క్యాంపు కార్యాలయానికి రావాలని ప్రదాక్షేత్రంలో ప్రజల సమస్యలు తప్పకుండా తీరుస్తామని వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఏఎస్పి రాములు,డి.ఎస్.పి మహేష్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసులు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి వెంకటేష్, ప్రచార కార్యదర్శి బెనహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, మహబూబ్ నగర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ బెక్కరి మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వసంత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, మాజీ మహిళ అధ్యక్షురాలు అనిత, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ లింగం నాయక్, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడ సాయిబాబా, ఐఎన్‌టీయూసీ రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మహాలక్ష్మి,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రజా ప్రభుత్వం అంటే ఏమిటో రెండు రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపించారని మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయ తలపెట్టి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీ లైన మహాలక్ష్మి,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను ఆయన ఆదివారం మహబూబ్ నగర్ లో ప్రారంభించారు. మహాలక్మి పథకం కింద మహిళలందరికీ రాష్ట్ర ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అయన మహబూబ్‌న‌గర్ జిల్లా కేంద్రంలోని నూతన బస్టాండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్ గడీలను బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరిగిందని, ఆర్టీసీ బస్సులలో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. మహాలక్ష్మి పథకం పట్ల మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, తాను మహాలక్ష్మి పథకం ప్రారంభించి బస్సులో కూర్చున్న సందర్భంలో ఇంజనీరింగ్ చదివే అమ్మాయి ప్రతిరోజు మహబూబ్నగర్ నుండి హైదరాబాద్ కు చార్జీ చెల్లించి బస్సులో వెళ్లేదని, అలాంటిది ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి మహిళల ఉచిత ఆర్‌టీసి ప్రయాణ పథకం కారణంగా తాను ఉచితంగా బస్సులో వెళ్లేందుకు అవకాశం కలిగిందని సంతోషం వ్యక్తం చేసిందని తెలిపారు. అంతేకాక మరో మహిళ వారి కుటుంబ సభ్యులలో ఒకరికి క్యాన్సర్ చికిత్స నిమిత్తం వారంలో రెండుసార్లు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, మహాలక్ష్మి పథకం రావటం వల్ల పైసా ఖర్చు లేకుండా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి వారికి సేవ అందించే అవకాశం కలిగిందని ఎంతో ఉద్వేగ బరితంగా చెబుతున్నారని పేర్కొన్నారు. మహిళలందరికీ ఎంతో ఉపయోగపడే ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో మహాలక్ష్మి పథకం కింద వెయ్యి కొత్త బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, సంక్రాంతి నాటికి కొత్త బస్సులతో ఏర్పాటు చేయడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మహిళలకు ఇచ్చిన కానుక అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డిఎం సుజాత, ఆర్డిఓ అనిల్ కుమార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement