Wednesday, May 8, 2024

మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ పనులు పూర్తి చేయండి: కోమటిరెడ్డి విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల లేమి కారణంగా నిలిచిపోయిన మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ రెండవ దశ పనులను త్వరగా పూర్తి చేయాలని తాను చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. భువనగిరి జిల్లా రాయగిరి వరకు రైళ్ల రాకపోకలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు మంజూరు చేయని కారణంగా పనులు ముందుకు సాగటం లేదని కోమటిరెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.

ఈ నిర్మాణం పూర్తయితే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి వెంటనే తగిన అనుమతులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా రెండవ దశ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement