Tuesday, May 14, 2024

సీతారాముల కల్యాణం చూతము రారండి.. భద్రాద్రికి తరలివచ్చిన భక్తకోటి

భద్రాచలం, ప్రభన్యూస్‌: భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. సీతారాముల కల్యాణ గడియలు ఆసన్నమవుతుండగా రామనామ స్మరణతో భద్రగిరి పులకించిపోతోంది. మరికొద్ది గంటల్లో లోకకల్యాణం జరగ నుంది. సీతారాముల కల్యాణానికి వచ్చిన భక్తులతో భద్రుని కొండ కళకళలాడుతుంది. సప్తవర్ణాల వెలుగులు, విద్యుత్‌ అలంకరణలు, సరికొత్త హంగులతో భద్రాద్రి పట్టణానికి నవ్యకళ చేకూరింది. రాములోరి కల్యాణానికి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లతో భద్రాద్రి సర్వాంగ సుందరంగా మారింది. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా రామయ్య పెళ్ళిని తిలకించేందుకు భక్త కోటి ఇక్కడకు చేరుకుంటున్నారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలతో… శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దర్శన భాగ్యంతో భక్తులు పరవశిస్తున్నారు. స్వయంవర విజేత రఘుకుల తిలకుడికి మెడలో హారం ఎప్పుడు వేద్దామా.. అని సీతమ్మ మనసు ఉవ్విళ్ళూరుతుంది.

సాంప్రదాయం ప్రకారం అభిజిత్‌ లగ్నంలో అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మిధిలా స్టేడియం శిల్పకళ శోభితమై లోక కల్యాణానికి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి రానున్నారు. దేశ, విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ కవిత, ప్ర భుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సీతారాముల కల్యాణానికి హాజరవుతున్నారని అధికార వర్గాల సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

భక్తులతో పోటెత్తిన శ్రీరామ దివ్యక్షేత్రం
రాములోరి కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో భద్రాచలం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల సేవ కోసం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి పానకం, మజ్జిగ, మంచినీళ్లు, పులిహోర, దద్దోజనం వంటివి అందుబాటులో ఉంచారు. 60కౌంటర్‌ల ద్వారా ఉచితంగా తలంబ్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో ప్రసాదాలు విక్రయించేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా సేవలు అందుబాటులోకి తేనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement