Sunday, May 19, 2024

ఉద్యమాలు మాకు కొత్త కాదు.. దీక్షతో పీయూష్ గోయల్‌కు నూకలు చెల్లేలా చేస్తాం.. ఢిల్లీలో ముమ్మరంగా దీక్ష ఏర్పాట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా ప్రజలను నూకలు తినమని ఎగతాళి చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఢిల్లీలో సోమవారం చేస్తున్న దీక్షతో నూకలు చెల్లిపోయేలా చేస్తామని టీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రభుత్వం ఈనెల 11వ తేదీన ఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో చేపట్టిన రైతు దీక్ష ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేదిక, సభా ప్రాంగణం, హోర్డింగ్‌ల ఏర్పాట్లను రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బృందాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. దీక్షకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న 1500 మంది వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, ఇతర నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వసతి, రవాణా, భోజన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణా భవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దీక్ష సజావుగా నిర్వహించేలా పలు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణా భవన్‌లోని సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చిన అనంతరం ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌ మీడియాతో మాట్లాడారు.

శతాబ్దాల సంప్రదాయం ఒకేసారి మారదు : ఎంపీ కేకే..

రాష్ట్రాల అవసరాలు తీరిన తరువాత ఎఫ్‌సీఐ ద్వారా పంటల సేకరణ అనేది వందల సంవత్సరాలుగా జరుగుతోందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వచ్చే బియ్యం తీసుకోబోమని చెప్పిందని, తమ మెడ మీద కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ పంపకండంటూ ఒప్పందం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. వెయ్యేళ్లుగా వచ్చే సంప్రదాయం ఒకేసారి మారిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం చెప్పలేని రీతిలో వరి పండించవద్దని రైతులకు నేరుగా చెప్పామని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరామని కేకే తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వచ్చే వరకు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని ఆయన అన్నారు. లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ నూకలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, కేంద్రం ధాన్యం సేకరించి ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉంచి విదేశాలలో అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు చేయాలని సూచించారు. కేంద్ర నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా రైతుల కష్టాలను చూపించడానికే ధర్నా చేస్తున్నామని కేకే వెల్లడించారు. ఉద్యమాలు తమకు కొత్త కాదన్న ఆయన, రాష్ట్రం ఏర్పడిందే ఉద్యమాల మీదని చెప్పుకొచ్చారు. రైతుల్లో అవగాహన వచ్చే వరకు, పంటల మార్పిడి జరిగే వరకు సహకరించాలని కోరుతున్నా కేంద్రం స్పందించట్లేదు కాబట్టే నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధర్నాలో పాల్గొంటోందని కేకే చెప్పారు.

పోరాటాల గడ్డ నుంచి వచ్చాం.. పోరాడి సాధించుకుంటాం : ఎంపీ నామా..

కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రం తెలంగాణ ధాన్యం కొనే వరకు వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై తమ పార్టీలో అన్ని స్థాయుల్లో పోరాటం చేశామని అన్నారు. వరి ధాన్యాన్ని కనీస మద్ధతు ధర ప్రకారం ప్రతి గింజా కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. తెలంగాణ ముందుకెళ్తోంది, అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది కాబట్టి దాన్ని ఆపేందుకు కేంద్ర సర్కారు ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాడామని, అన్ని గ్రామాల నుంచి గ్రామసభల తీర్మానాలు చేసి పంపించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. కేంద్రం పాలన చేస్తున్న ఢిల్లీ గడ్డ నుంచే దీక్ష మొదలుపెట్టామని తెలిపారు. ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడే ఎందుకు అంటూ కొందరు అడుగుతున్నారన్న నామా, అంతకు ముందు ఏం పండిందని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న చర్యలతో పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తమ ఎంపీలు, మంత్రులను అవమానపరిచేలా కేంద్ర మంత్రులు మాట్లాడారని, మీకేం పనిలేదా? ఢిల్లీ వస్తున్నారు అని ఒకసారి, నూకలు తినండంటూ మరోసారి వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచైనా సరే రైతులను కాపాడుకుంటామని నామా నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. పోరాటాల గడ్డ మీద నుంచి వచ్చిన వాళ్లం పోరాడి సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి ఎందుకు రైతుల కోసం మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు.

- Advertisement -

తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఎంపీ రంజిత్ రెడ్డి..

ఢిల్లీలో తమ నిరసనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణా ప్రజలను నూకలు తినమని ఎగతాళి చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు నూకలు చెల్లేలా చేస్తామని హెచ్చరించారు. పంజాబ్ వెళ్లి ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పే ధైర్యం పీయూష్ గోయల్‌కు ఉందా అని ప్రశ్నించారు. పంటల సేకరణలో జాతీయ విధానముండాలని రంజిత్‌రెడ్డి నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి మొత్తం ధాన్యాన్ని సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

మా దీక్షతో కేంద్రం దిగిరాక తప్పదు : ఎంపీ బీబీ పాటిల్..

భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టే జై జవాన్ – జై కిసాన్ నినాదం వచ్చిందని బీబీ పాటిల్ అన్నారు. అలాంటి దేశంలో రైతులకు ప్రతికూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటని అడిగితే మీ దగ్గర రీసైకిలింగ్ జరుగుతుందని మొదట అన్నారని… రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి రైతు అనుకూల నిర్ణయాలతో పంట దిగుబడి పెరిగితే, ఆ నిజాన్ని అంగీకరించలేక రీసైకిలింగ్ అంటూ బురద జల్లుతున్నారని విమర్శించారు. బఫర్ స్టాక్‌ను ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని అన్నారు. పారా బాయిల్డ్ రైస్ కచ్చితంగా కేంద్రం కొనాలని, వాతావరణ పరిస్థితుల కారణంగా పారాబాయిల్డ్ రైస్ దిగుబడి చేయాల్సి వస్తోందనే విషయాన్ని కేంద్రం గ్రహించాలని బీబీ పాటిల్ సూచించారు. గతంలో ఢిల్లీని చుట్టుముట్టిన రైతులను ఇబ్బంది పెట్టాలని చూసినా, వారి పట్టుదల, ఉద్యమంతో కేంద్రం దిగొచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాగే తాము చేపట్టే రైతు దీక్షతో కేంద్రం దిగిరాక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా దూకుడుగా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని బీబీ పాటిల్ నొక్కి చెప్పారు.

వారం రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధానిని కలిస్తే కొంతైనా సమస్య పరిష్కారమయ్యేది కదా… అలా కాకుండా దీక్షమీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ఆంధ్రప్రభ అడిగిన ప్రశ్నకు… కేసీఆర్ చికిత్స కోసం ఢిల్లీ వచ్చారని కేకే సమాధానమిచ్చారు. పంటి చికిత్సను పక్కనపెట్టి ప్రధానిని కలవమని మీలా చెప్పే చెప్పే ధైర్యం నాకు లేదన్నారు. ఇప్పటికే కేసీఆర్‌కు రెండు దంతాలు తొలగించారని, చికిత్స కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. దీక్షలో కేసీఆర్ పాల్గొంటారా అని మరో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాజకీయాంశాల్లో సర్‌ప్రైజ్ ఉండాలని కేకే వ్యాఖ్యానించారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement