Monday, April 29, 2024

మిర్చి @40 వేలు! ఎనుమాముల మార్కెట్‌లో రికార్డు ధర..

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: పసిడి పరుగులను మించి ఎర్రబంగారం పరుగులు పెడుతోంది.. మునుపెన్నడూ లేని విధంగా మిర్చికి గరిష్ట స్థాయిలో రికార్డు ధర నమోదైంది.. బహుశా ప్రపంచంలోనే అత్యధిక ధర వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో నమోదైంది. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రానికి చెందిన డి.సుధాకర్‌రావు అనే రైతు 11 బస్తాలు దేశీ మిర్చి (సింగల్‌పట్టీ) రకాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చారు. మిర్చి నాణ్యంగా ఉండటంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులు పోటీ పడ్డారు. రాజరాజేశ్వరి చిల్లిస్‌ వ్యాపారి రికార్డు స్థాయిలో క్వింటాకు 40 వేల రూపాయల ధర చెల్లిస్తూ దక్కించుకున్నారు. మార్కెట్‌ వ్యవస్థలోనే గరిష్టంగా నమోదైన ధరగా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధర రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యాపార వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. బంగారం ధర మార్కెట్‌లో రోజుకు 200, 500 ఇలా గరిష్టస్థాయిలో ధర పెరుగుతుండగా, ఎర్రబంగారం మాత్రం పసిడిని తలదన్నేందుకు ఏకంగా వేలల్లోనే ధర నమోదుకావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

ఈ ఏడాది అకాలవర్షాలు, వింతైన వైరస్‌ తెగుళ్లు, అంతుచిక్కని చీడపీడలతో మిర్చి పంట భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కష్టే ఫలి అన్న చందంగా కష్టపడి పంటను కాపాడుకున్న రైతుకు ఈ రోజు మార్కెట్‌లో సిరుల వర్షం కురిపిస్తున్నది.
పదిరోజుల క్రితం ఇదే దేశీరకం మిర్చి క్వింటాకు 32 వేల రూపాయలు ధర నమోదు కాగా, రికార్డు స్థాయి ధరగా భావించారు. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి ఉన్న డిమాండ్‌తో దినదినం ధరలు పైపైకి పెరుగుతుండటం రైతులకు మరింత కలిసిరానున్నదనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు.

పత్తికి గరిష్టంగా క్వింటాకు రూ.10,100..

తెల్లబంగారం సాగు చేసిన రైతులకు కూడా ఏడాది అనూహ్యంగా కలిసివచ్చింది. గత ఆరు మాసాలుగా మార్కెట్‌లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో గరిష్టంగా రూ.9,800 వరకు ధర నమోదు కాగా, మంగళవారం రికార్డు స్థాయిలో క్వింటాకు 10,100 రూపాయలు గరిష్ట ధర నమోదైంది. అయితే గతంలో ఖమ్మం, అదిలాబాద్‌, జమ్మికుంట, పరకాల మార్కెట్‌లలో 10 వేల మార్క్‌ను దాటినప్పటికీ.. ఏనుమాముల మార్కెట్‌ లో దాటలేదు. మంగళవారం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హావేలికి చెందిన తిరుపతి అనే రైతు 17 బస్తాల పత్తిని తీసుకురాగా విశ్వనాథ్‌ ట్రెడింగ్‌ కంపెనీ అత్యధికంగా క్వింటాకు 10,100 చెల్లిస్తూ కొనుగోలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement