Saturday, May 4, 2024

BRS vs BJP – తెలంగాణపై కేంద్రం శీతకన్ను – నిధుల‌లో కోత‌లు..ఎగ‌వేత‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణపై కేంద్రం శీతకన్ను వేసిందనే ప్రచారం వాస్తవమేనని కాగ్‌ అధికారికంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదికలో ఇదే అంశం ప్రస్పుటమైంది. ప్రధానంగా గ్రాంట్లు, పన్ను ఆదాయం, జీఎస్‌టీ చెల్లింపులు ఇతర నిధుల విషయంలో పెద్దఎత్తున కోతలు విధిస్తోందని రుజువైంది. కొన్నిసార్లు బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగానే చూపినా విడుదల చేసేటప్పుడు మాత్రం విదిలిస్తోందని తేటతెల్లమైంది. ఇంకా కొన్ని సందర్భాల్లో తీవ్ర జాప్యంతో తదుపరి ఏడాది కూడా విడుదల చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ సర్కార్‌ భూముల విక్రయాలు, ముందస్తు ప్రణాళికతో పన్నేతర ఆదాయాలను పెంచుకుంటూ ముందుకు సాగుతోందని, అప్పుల పరిమితి ఆదర్శంగా ఉన్నదనే విషయం అధికారికంగా వెల్లడైంది. కేంద్ర నిర్లక్ష్యంతోనే తెలంగాణ ఆర్థిక వ్యవహారాలు తలకుమించిన భారంగా మారుతున్నాయని, దీంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులపై దృష్టిపెట్టి, ఆదాయాన్ని పెంచుకుని సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని ఆర్ధిక శాఖ నివేదిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ పురుడుపోసుకున్న తొలి ఏడాది నుంచే కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని అవలంభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఏనాడూ కేంద్రం సాయమందించలేదు. పన్నుల రూపంలో రావాల్సిన వాటాతోపాటు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో అందాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తూనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.

ప్రత్యేక కేటాయింపులేమీ లేవు…
ఇక రాష్ట్రానికి కేంద్రం తొమ్మిదేళ్లలో ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. గిరిజన వర్సిటీకి రూ.26.90 కోట్లు కేటాయించిన కేంద్రం జాతీయ సంస్థలకు మినహా పెద్దగా రాష్ట్ర ప్రయోజనాలకు కేటాయింపులేమీ చేయలేదు. ఐఐఎం, ఐఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల స్థాపన, ఎయిమ్స్‌కు నిర్దిష్టంగా నిధుల ప్రస్తావన చేయలేదు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన నివ్జ్‌ుకు రూ.500 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనతోపాటు, ఆదిలాబాద్‌లో సీసీఐ పునరుద్ధరణ, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు రూ.1000 కోట్లు సాయం కోరినా కేంద్రం ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. ఇక 15వ ఆర్థికసంఘం 42 శాతం వాటాను 41కి తగ్గించడంతో ఈ ప్రభావం ఈ ఏడాది నుంచి మరింత తీవ్రం కానుంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా నిధులను గత రెండు మూడేళ్లుగా ఏనాడూ ఆ స్థాయిలో చెల్లింపులు చేయలేదు.

కేంద్ర నిర్లక్ష్యం ఫలితంగానే….
కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల కారణంగా రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడుతోంది. అయినప్పటికీ ఎటువంటి ప్రతికూలతలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొ ంటూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్న తెలంగాణ తాజా ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడిలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌ఎస్‌, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్‌ 12.9 శాతం తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈ వృద్ధి రేటును నమోదు చేయడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగి తొమ్మిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచి ఆర్థిక పురోగతిలో దూసుకుపోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement