Tuesday, May 7, 2024

BRS readay to war – అసెంబ్లీలో ఆరు గ్యారంటీల‌పై అధికార‌ప‌క్షంతో బిఆర్ఎస్ ఢీ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న భారాస.. కాంగ్రెస్‌ సర్కార్‌ను ఇరుకాటం పెట్టే వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. మొదట మూడు నెలలు తర్వాత ప్రశ్నిద్ధామనుకున్నా.. అసెంబ్లిలో కాంగ్రెస్‌ మొదటి రోజే విమర్శలు ఎక్కుపెట్టడంతో గులాబీ అధిష్టానం అలెర్ట్‌ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీని వదిలితే జనాలు అబద్ధాల్ని నిజం అనుకునే ప్రమాదం ఉందని భావిస్తోంది. కాంగ్రెస్‌ చేసిన మోసాల్ని, దగాను, వారి పాలనలో పడిన కష్టాల్ని, స్కామ్‌లను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని సభలోనే హెచ్చరించిన భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావులు.. ఇప్పుడు ఎదురు దాడికి అస్త్రాలను రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంపై బురద జల్లి పబ్బం గట్టుకోవాలని చూస్తోం దన్న విషయాన్ని లేవనెత్తబోతున్నారు. ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీలను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్న గులాబీ ఎమ్మెల్యేలు.. సర్కార్‌ను ఇరకాటంలో పడేసేలా అస్త్రాలతో రానున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధి కారంలోకి వచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీ లను ప్రకటించింది. అందులో రెండు గ్యారెంటీలను నెర వేర్చామని చెబుతోంది. వాస్తవానికి రెండు గ్యారెంటీలను నెరవేర్చలేదని భారాస అంటోంది. ఇచ్చిన గ్యారెంటీలకు, నెరవేర్చిన గ్యారెంటీలకు, కాంగ్రెస్‌ చెబుతున్న మాటలకు చాలా తేడా ఉందన్న విషయాన్ని లేవనెత్తబోతుంది. ఆరోగ్యశ్రీ ఎప్పటిలాగే కొనసాగుతోంది. దాన్ని పేపర్లో పెంచ డం తప్ప.. అమల్లో ఎక్కడ ఉందో చూపించాలని ప్రశ్నించ బోతుంది. ఎన్నికల్లో అధికారం చేపట్టగానే ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని వెల్లడించిన విషయాన్ని లేవనెత్తే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలను నెరవేర్చలేక గతంలోని భారాస సర్కార్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని చెబుతూనే.. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్‌ చేస్తోంది. ఆరు గ్యారెంటీలను ముమ్మాటికి నెరవేర్చాలని గళం వినిపించబోతుంది. ఇప్పటికే భారాస ఆరు గ్యారెంటీలకు సమయాన్ని ఇచ్చింది. ఆ గడువు లోగా నెరవేర్చని పక్షంలో ప్రజా పోరాటానికి సిద్ధం అన్న సంకేతాలను పంపింది. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలను ఇప్పట్లో నెరవేర్చేలా లేదని భారాస బావిస్తోంది. అందులో బాగంగానే కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసే వ్యూహాన్ని గ్యారెంటీలపై అమలు చేయబోతుంది.

మహాలక్ష్మీ గ్యారెంటీలో ఆ రెండు ఎప్పుడు ఇస్తారు..?
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల్లో మహిళల కోసం మహాలక్ష్మీ గ్యారెంటీని ప్రకటించింది. అందులో ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం ప్రకటించింది. రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ను ఇస్తామని వెల్లడించింది. రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామంది. ఇవన్నీ కలిపి మహిలక్ష్మీ గ్యారెంటీగా ప్రకటించింది. అయితే ఇందులో ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చింది. ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణాన్ని ఉచితం చేసి.. దాన్ని మహిలక్ష్మీ ్య గ్యారెంటీ మొత్తం నెరవేర్చామని కలరింగ్‌ ఇస్తుందన్న విషయాన్ని భారాస లేవనెత్తబోతుంది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను నెరవేర్చామని విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన మహాలక్ష్మీ గ్యారెంటీలో ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని భారాస డిమాండ్‌ చేయబోతుంది. ఆ రెండింటిని నెరవేరిస్తేనే మహాలక్ష్మీ గ్యారెంటీ నెరవేర్చినదిగా బావించాల్సి వస్తుందని, కానీ జనాల్ని కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టిస్తోందని భారాస తీవ్ర స్థాయిలో ప్రతిగటించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టీసీ బస్సు అంటే సిద్ధంగా ఉంది.. ఓ సంతకం పెట్టి పడేస్తే సరిపోతుందని.. ఆ నష్టాన్ని, సంస్థ, ఉద్యోగుల క్షేమం, ప్రయాణికుల బాగోగులు తమకు పట్టవన్నట్లుగా వ్యవహరించిందనే విషయాలపై గట్టిగా నిలదీసే ప్లాన్‌లో ఉంది.

చేయూత అంటే ఆరోగ్య శ్రీ ఒక్కటే కాదు..
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల బీమా సదుపాయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. చేయూత గ్యారెంటీని నెరవేర్చామని వెల్లడించింది. అయితే ఎన్నికల ప్రచారంలో చేయూత గ్యారెంటీ కింద పింఛనుదారులకు నెలకు రూ. 4,000 పింఛను ఇస్తామని ప్రకటించారు. చేయూత గ్యారెంటీ పేరుతో ఆరోగ్య శ్రీ తో పాటే పింఛను రూ. 4000 ఇస్తామన్న హామీ ఇచ్చారు. ఈ రెండు కలిపే చేయూత గ్యారెంటీ కిందికి వస్తాయి. అంటే ఇక్కడ ఇందులో ఆరోగ్య శ్రీ పరిమితిని కాగితాల్లోనే పెంచారు తప్పితే.. వైద్య సేవల్లో సరిగ్గా అమలు కావడం లేదన్న విషయాన్ని భారాస లేవనెత్తబోతుంది.

రెండు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి పూర్తిగా చేయలేదే..?
మహాలక్ష్మీ గ్యారెంటీలో మూడు హామీలు ఇవ్వగా.. అందులో ఆర్టీసీ బస్సు, చేయూతలో రెండు హామీలు ఇవ్వగా పింఛను కాకుండా ఆరోగ్య శ్రీ మాత్రమే అమలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ లెక్కన ఏ ఒక్క గ్యారెంటీ పూర్తిగా నెరవేర్చలేదు. కానీ రెండు గ్యారెంటీలను నెరవేర్చామని చెబుతోంది. వాస్తవానికి రెండు గ్యారెంటీల్లో అందులో ఒక్కటి, ఇందులో ఒక్కటి మాత్రమే నెరవేర్చినట్లుగా చూడాల్సి ఉంటుందని భారాస వెల్లడిస్తోంది. ఆరు గ్యారెంటీల్లో ప్రజలకు అవసరం ఉన్న రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000, వరి పంటకు బోనస్‌, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ప్రతి నెల రూ. 2,500 ఆర్థిక సాయం, 200 యూనిట్ల కరెంట్‌ ఉచితం, విద్యా భరోసా లాంటివి అమలు చేయకుండా తాత్సారం చేస్తోందంటూ ప్రశ్నించబోతుంది.

- Advertisement -

సీఎంకు సెక్యూరిటీ వద్దు.. తమ్ముడికి మాత్రం ఎస్కార్ట్‌
సీఎం రేవంత్‌ రెడ్డి తనకు సెక్యూరిటీని తగ్గించాలని, తాను వెళ్లే దారిలో ట్రాఫిక్‌లో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని స్టేట్‌ మెంట్‌లు ఇస్తున్నారని, చెప్పేది ఒక్కటి.. చేసేది మరొక్కటి అంటూ భారాస ప్రశ్నించే యోచనలో ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి తమ్ముడికి ఎలా ఎస్కార్ట్‌, సెక్యూరిటీని ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రశ్నించబోతుంది. ప్రజా ప్రతినిధి కాదు.. అలాంటప్పుడు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని రేవంత్‌ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతుంది. అసెంబ్లిdలో కేటీఆర్‌, హరీష్‌ రావుపై విమర్శలు చేస్తూనే ఆ కుటుంబానిదే అంతా నడుస్తుందని, మాట్లాడనివ్వరని లేవనెత్తారు. ఇప్పుడు అదే అంశాన్ని రేవంత్‌ రెడ్డిపై కూడా భారాస ప్రయోగించే ప్లాన్‌లో ఉంది. ఇలా ప్రతి అంశంలో ఉద్యమ పార్టీగా ఇరుకున పెట్టడం తమకు సులువు అనే విధంగా భారాస ముందుకు వెళ్లబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement