Monday, April 29, 2024

BRS Party Road Show – అలుగుడు అలుగుడే.. గిలుగుడు గిలుగుడే – ఎన్ని తీస్మార్ ఖాన్లొచ్చినా కేసీఆర్ దే విజయం – కెటిఆర్

‘‘కాంగ్రెస్, బీజేపీలను ఓట్లతో పొడవాలా? తెలంగాణాను కాపాడుకోవాలి, ఢిల్లీ నుంచి పెద్ద పెద్దళ్లు బయలు దేరారు. 15 మంది మంత్రులు, 15 మంది సీఎంలు, వెనుక బోగిలో సోనియాగాంధీ, ఖర్గే, ఇంకా చాలా మంది వస్తున్నారు. షేర్లు, తీస్మార్ ఖాన్లు ఎంత మంది వచ్చినా కేసీఆర్కు భయం లేదు. సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుంది.. ఈ ఎన్నికలు ఆగం ఆగం కాదు, దుబ్బాక తలరాత, తెలంగాణ తలరాతను నిర్ణయించే ఎలక్షన్లు, ఒక్క సారి ఆలోచించి ఓటు వేయండి’’, అని రాష్ర్ట మంత్రి కే.తారకరామారావు ఉద్వేగంగా ప్రజలను కోరారు.


దుబ్బాకలో మంగళవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కొత్త ప్రభాకరరెడ్డి కత్తిపోట్ల నుంచి కోలుకుని నేటి సభలో పాల్గొన్నారు.. దుబ్బాక నియోజకవర్గంలోని అశేష ప్రజానీకం ఈ రోడ్ షోకు తరలివచ్చింది. భారీ స్థాయిలో పరవళ్లు తొక్కుతున్న జన ప్రవాహాన్ని చూసిన కేటీఆర్ ఆద్యంతం తన ప్రసంగంతో ప్రజలను ఉర్రూతలూగించారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాయోపాయంతో డబ్బులు వెదజల్లి 1000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, కానీ దుబ్బాకకు ఒక్క పని చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

అక్కలకు, చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు, అన్నలకు ఏమన్నా సాయం చేశారా? అమిత్షా దగ్గరకు పోతా ఏకుతా, పీకుతా అని గొప్పలు పోయాడు, కనీసం తట్టెడు మట్టి పోశాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమ్మాయికి పుస్తెలు, మెట్టెలు ఇస్తాం, ఎద్దుబండి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పిన ఈ జోకర్ ఏ పనైనా చేశాడా? ఈ బఫూన్ను ఎందుకు గెలిపించాలో? ఆలోచించండని కేటీఆర్ ప్రజలను కోరారు. కర్ణాటక నుంచి కాంగ్రెసేళ్లకు, గుజరాత్ నుంచి బీజేపోళ్లకు డబ్బులు వస్తున్నాయి. ఇవి చాలు వీళ్లకి. జనం బాధలతో పని లేదు. తెలంగాణను ఆంద్రాలో కలపటానికి ఒప్పుకుని చేసిన పొరబాటుకు 58 ఏళ్లు శిక్షను అనుభవించాం, మరో సారి తప్పు చేస్తే ఊళ్లో కరెంటు ఉండదు, తాగునీళ్లు దొరకవు. మళ్ళీ అవే కష్టాలు వస్తాయి, ఒక్కసారి ఆలోచించండి, అని కేటీఆర్ దుబ్బాక ప్రజలను కోరారు.

ఈ జోకర్లు మళ్లీ లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు. భూములు గుంజుకుంటారంట. అందుకే కేసీఆర్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ భూములపై దళితులు, గిరిజనులకే యాజమాన్య హక్కు కల్పిస్తాం. ఇక ఈ భూమి పేదలదే. బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు. అమ్ముకోవచ్చు. పిల్లలకు ఇచ్చుకోవచ్చు… డిసెంబ ర్ 3 తరువాత ఈ భూమి హక్కును మీకే ఇస్తాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు. కరెంటు వృథా అని రేవంత్ రెడ్డి , రైతు బంధు వేస్టు అని ఉత్తమ్కుమార్ రెడ్డి, ధరణీని బంగాళాఖాతంలో కలిసేస్తామని మరో సిఫాయి భట్టి విక్రమార్క చెలరేగిపోతున్నారని, కోమటి రెడ్డి ఏకంగా కరెంటు ఎక్కడుందని అడుగుతున్నాడని, వీరందరికీ బస్సు, బిర్యానీ సదుపాయం కల్పిస్తామని, దుబ్బాక నియోజకవర్గంలో తమకు ఇష్టం వచ్చిన ఊరు పోయి గట్టిగా కరెంటు తీగల్ని పట్టుకోమనండి, దెబ్బకు తెలంగాణ దరిద్ర్యం పోతుందని కేటీఆర్ సెటైర్లు వేశారు.
తఇప్పుడు వచ్చి కాంగ్రెసోళ్లు ఒక్క చాన్ప్ ఇవ్వాలని అడుగుతున్నారని, ఇప్పటికి 11 సార్లు అవకాశం ఇచ్చాం, ఏమీ చేశారు? తెలంగాణాను ఆగం ఆగం చేశారు. మళ్లీ ఆగం కావటానికి మరో చాన్స్ ఇవ్వాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక సంక్షేమ పథకాల్లో అందరికీ వెంటనే అవకాశాలు రావు. అలుగుడు, గిలుగుడు మామాలూ, అందరినీ సముదాయించండి, ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఉండరు, అంతమాత్రాన అలుగుడు, గిలుగుడు వద్దని చెప్పండి, అందరం ఐక్యమై ఢిల్లీ గద్దల్ని అడ్డుకుని తెలంగాణాను కాపాడుకుందాం, అని కేటీఆర్ హితబోధ చేశారు. నాలుగు కోట్ల మంది ఈ కుటుంబంలో అలుగుడు, గిలుగుడు ఎంత ఉన్నా.. అందరం కలిసి గిలుగుడు గిలుగుడే..గుద్దుడు గుద్దుడే అని నిరూపించండి..నవంబర్ 30న దుబ్బాక బాక్సుల్లో దుమ్మురేగాలి, దమ్ము రేగాలి అని కేసీఆర్ దుబ్బాక ప్రజలను ఉత్సాహ పరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement