Sunday, April 28, 2024

BJP – కొత్తగూడెంకు ఎయిర్‌పోర్ట్ తీసుకొస్తా – సీతారాం నాయక్

న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ: తనకు ఓటేసి గెలిపిస్తే కొత్తగూడెంలో విమానాశ్రయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన మహబూబాబాద్ లోక్‌సభ స్థానం తనకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ సహా పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

గత పదేళ్ళలో దేశాభివృద్ధి, పుణ్యక్షేత్రాల అభివృద్ధి, నీతి నిజాయితీ వంటి అంశాలు బీజేపీని మూడోసారి అధికారంలోకి తెస్తాయని, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో ఓట్లు వేయించుకుని ప్రజలనే తలదన్నేలా వ్యవహరించిన బీఆర్ఎస్ అహంకారాన్ని ఓటర్లు అణచివేశారని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ 12 సీట్లలో గెలుపు ఖాయమని అన్నారు. అయోధ్యను అభివృద్ధి చేసిన మోడీని దక్షిణ భారతంలో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో మోడీ టికెట్ ఇచ్చారని, మహబూబాబాద్ లో గెలిచి తీరుతానని అన్నారు. ములుగులో గిరిజన విశ్వ విద్యాలయం తీసుకొచ్చానని, పాస్‌పోర్ట్ కేంద్రం తోపాటు రామప్పకు గుర్తింపు తేవడంలో తన పాత్ర ఉందని అన్నారు. గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement