Sunday, April 28, 2024

Aspirants – హస్తినలో కాంగ్రెస్ ఆశావహులు ప్రదక్షిణాలు – చిక్కుముడిలో వరంగల్, పెద్దపల్లి స్థానాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఇప్పటి వరకు కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించగా.. మిగతా 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు జరుపుతోంది. ఈ నెల 18న (సోమవారం) ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో తెలంగాణలోని మిగతా స్థానాలపై చర్చించనున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలు తమకు గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఆ మేరకు టికెట్ తమకే కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం కోసం పరిశీలిస్తున్న పేర్లలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, ఆ తర్వాత క్రమంలో మాజీ ఎంపీ సుగుణ కుమారి, యూత్ కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చిన సమయంలో తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని షరతులు పెట్టగా.. అందుకు రాష్ట్ర నాయకత్వం అంగీకరించినట్టు తెలిసింది. వివేక్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఇప్పుడు ఆయన కుమారుడు పెద్దపల్లి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు.

అయితే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ రెండ్రోజుల క్రితం నిర్వహించిన ఓ సమావేసంలో పెద్దపల్లి నియోజకవర్గం కార్యకర్తలు, నేతలు, ఆ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. వెంకటస్వామి కుటుంబం నుంచి వివేక్, ఆయన సోదరుడు వినోద్‌ ఎమ్మెల్యేలుగా ఉండగా.. వారి సమీప బంధువు గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. పార్టీలో స్థానిక కార్యకర్తలు ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఒకే కుటుంబం నుంచి ఎంతమందికి టికెట్లు ఇస్తారంటూ ప్రశ్నించినట్టు తెలిసింది.

మరోవైపు రాష్ట్రంలోని దళిత జనాభాలో మాదిగ సామాజికవర్గం ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సామాజిక సమీకరణాల ప్రకారం రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు (పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, వరంగల్) రెండు చోట్ల మాదిగ సామాజికవర్గానికి, ఒక చోట మాల లేదా మరే ఇతర దళిత సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తుంటారు. వీటిలో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు మాల సామాజికవర్గానికి చెందిన మల్లు రవి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మాదిగ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.

ఈ ఇద్దరిలో మల్లు రవికి టికెట్ కేటాయిస్తే.. పెద్దపల్లిలో అనివార్యంగా మాదిగ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రకారం వంశీకి బదులుగా సుగుణ కుమారి లేదా వరప్రసాద్‌లలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తనకు అవకాశం లభిస్తుందన్న ఆశతో వరప్రసాద్ ఢిల్లీలోని అధిష్టానం పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. వరంగల్ నియోజకవర్గం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో ఇక్కడ జరిగిమన బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ 3.5 లక్షల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొందని ప్రచారం జరుగుతున్న వేళ, బీఆర్ఎస్ ఈసారి వ్యూహాత్మకంగా జిల్లాలో పెద్ద నేతగా ఉన్న కడియం శ్రీహరి కుమార్తె డా. కావ్యను బరిలోకి దించింది. బీజేపీ ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను బరిలోకి దించాలని చూస్తోంది. అయితే ఆయన్ను బీఆర్ఎస్ నేతలు దాదాపు కిడ్నాప్ చేసినట్టుగా హైదరాబాద్ తీసుకెళ్లడం, బీజేపీలో చేరతారా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో దొమ్మటి సాంబయ్యకు టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేస్తున్నట్టు తెలిసింది. అయితే జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులతో ఉన్న పొత్తుల్లో భాగంగా వరంగల్ స్థానాన్ని తమకు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. పొత్తుల వ్యవహారం ఇంకా ఖరారు కానందున ఈ స్థానాన్ని అధిష్టానం ప్రస్తుతానికి పెండింగులో ఉంచింది. అయితే వరంగల్ నుంచి టికెట్ ఆశిస్తూ ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. తొలుత రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించగా.. అక్కణ్ణుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నేరుగా ఢిల్లీకే వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ వంటి నేతలను కలిసినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర నాయకత్వం ఆమోదిస్తేనే పార్టీలో చేర్చుకుంటామని కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బస చేస్తూ కాంగ్రెస్‌లో చేరేందుకు పాట్లు, అగచాట్లు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement