Thursday, May 2, 2024

రేపటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాకా రాజకీయ వేవ్ మొదలైంది. నాయకులు, పార్టీలు వరుస పెట్టి పర్యటనలు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిస్తున్నారు. ఇక హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయ నాయకులు సంచారం పీక్స్ కు వెళ్లింది. ఇక రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సమర శంఖం పూరించబోతున్నాడు. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తలపెట్టింది కాదని, నియంత పాలన నుంచి విముక్తి పొందా లని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కష్టాలు, బాధలు, ఇబ్బందులను క్షేత్రస్థాయి లో స్వయంగా తెలుసుకుని.. వారి కన్నీళ్లు తుడిచి.. బీజేపీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే పాదయాత్ర చేపడుతున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారన్నారు.కాగా తాను అక్టోబర్‌ 2వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నన్నట్లు తెలిపారు. 2023 ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటే.. ప్రత్యేక తెలంగాణ ప్రాథమిక లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరుతాయనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారని ఆయన అన్నారు.

ఇక, రోజుకు మినిమం 10 కిలోమీటర్లు పాద యాత్ర చేయనున్నారు బండి సంజయ్.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్‌ పరిధిలోనే ఆయన పాదయాత్ర కొనసాగనుంది.. రేపు రాత్రి మెహిదీపట్నంలోని పుల్లా రెడ్డి కాలేజ్‌లో బసచేయనున్న ఆయన.. ఎల్లుండి రాత్రి బాపు ఘాట్ దగ్గర బస చేస్తారు.. రేపు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ దేవాలయం నుండి ప్రారంభం అయ్యే యాత్ర.. మదినా, అఫ్జల్ గంజ్, బేగం బజార్, ఎంజే మార్కెట్‌, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వరకు తొలిరోజు బండి సంజయ్‌ పాదయాత్ర సాగనుంది. కాగా, బండి సంజయ్‌ పాదయాత్ర ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: పండగ షురూ.. సెప్టెంబర్ 10నే ‘టక్ జగదీష్’ రిలీజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement