Friday, May 17, 2024

Assembly – ఆ వ్యాఖ్య‌లు తొల‌గిస్తే తీర్మానానికి మ‌ద్ద‌తిస్తాం …హ‌రీష్ రావు

హైదరాబాద్ – కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు అని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పుస్తకానికి పేరును అవాస్తవాలు అని పెడితే బాగుండేదని మండిపడ్డారు తెలంగాణ మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపకానికి సంబంధించి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ని ఆయన ఖండించారు. రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో కృష్ణా నీటి ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు గత ప్రభుత్వం ఒప్పుకుందన్న విషయాన్ని హరీష్ రావు ఖండించారు. ఇది అసత్య ఆరోపణగా ఆయన తెలిపారు. ఇందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖ నిదర్శనం అంటూ లేఖను ఆయన చూపించారు. పేజీ నెంబర్ 3లోని పేరాగ్రాఫ్ సీలో ఈ వివరాలు ఉన్నాయన్నారు. 17వ KRMB మీటింగ్ లో కూడా గత ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు ఒప్పుకోలేదన్న విషయాన్ని రాహుల్ బొజ్జా రాశారని ఆయన వివరించారు.
నీటి వాటాల పంపకంపై 50-50 నిష్పత్తిలో ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి 26 లేఖలు రాశామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఐతే.. దీన్ని ఖండించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 2014-2022 మధ్య తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 512 TMCలు ఇచ్చేందుకు ఒప్పుకుందనీ, గత సంవత్సర కాలం నుంచి మాత్రమే 50-50 కోసం కోరుతోందని అన్నారు.

హ‌రీష్ వాద‌న‌కు అడ్డుప‌డ్డ రేవంత్….
ఈ సమయంలో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు నీరు ప్రాణ ప్రదం అన్నారు. దక్షిణ తెలంగాణ కృష్ణా నది జలాలపై ఆధారపడి జీవిస్తోందని తెలిపారు . మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టిన, తెలంగాణకు 551 టీఎంసీల నీరు రావాలనే తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా, కాదా అన్నది తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే ..

రేవంత్ రెడ్డి లాంటి వారు తెలంగాణ గురించి మాట్లాడితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తూ కేంద్రంతో జరిగిన మీటింగ్‌లో ఒప్పుకుందని హరీశ్ రావు అన్నారు. జనవరి 17, 2024న ఈ మీటింగ్ జరిగిందన్నారు. మర్నాడు పేపర్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పత్రికల్లో వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించలేదని హరీశ్ రావు అన్నారు. దీనిపై తాను అభ్యంతరం చెప్పగా, జనవరి 27, 2024న ప్రస్తుత ప్రభుత్వం మరో లేఖను కేంద్రానికి రాసిందనీ, అందులో మాత్రమే ప్రాజెక్టులను అప్పగించట్లేదని తెలిపినట్లు ఉందని హరీశ్ రావు చెప్పారు. కానీ ఫిబ్రవరి 1, 2024నన, జరిగిన రెండో సమావేశంలో తెలంగాణ పవర్ హౌస్‌లను KRMBకి అప్పగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమోదించడానికి తాము సిద్ధమే అన్న హరీశ్ రావు, అంతకంటే ముందు.. ప్రాజెక్టులను అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదట ఒప్పుకున్న విషయాన్ని అంగీకరించాలని డిమాండ్ చేశారు. తాము గతంలో పెట్టిన డిమాండ్లనే ప్రస్తుత ప్రభుత్వమూ పెడుతోందని అన్నారు. అలాగే గ‌త ప్ర‌భుత్వ త‌ప్పిదాలు అనే మాట‌ను తీర్మానం నుంచి తొలగించిన‌ట్ల‌యితే తీర్మానానికి తాము సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు హ‌రీష్ రావు..

కోమటిరెడ్డిపై హ‌రీష్ గ‌రం గ‌రం

- Advertisement -

కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభ పెట్టడంతోనే.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్‌ ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్‌ స్టేట్‌మెంట్‌ విన్నతర్వాత కేసీఆర్‌ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై హరీశ్‌ రావు అభ్యంతరం తెలిపారు.

కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌లు తొల‌గింపు ..

పదేండ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై అలాంట వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాహుల్‌ గాంధీని చెప్పుతో కొడతామని తాము అనలేమా అని ప్రశ్నించారు. అమేథీలో రాహుల్‌ని కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభాపతి ఏకపక్షంగా మంత్రి అవకాశం ఇవ్వడం తగదని విమర్శించారు. మంత్రి క్షమాపణలు చెబితేనే తాను మాట్లాడుతానని పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలను తొలగిస్తానని ప్రకటించడంతో హరీశ్‌ రావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement