Tuesday, May 14, 2024

గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట‌…ఫిరాయింపులే ల‌క్ష్యంగా పాలిటిక్స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఏకమయ్యాయా..? ఒకే ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాయా..? సొంత పార్టీలో గెలుపు గుర్రాలు లేక అధికార పార్టీ నేతలపై కన్నేశారా..? వీట న్నింటికి ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అవుననే సమాధా నాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీనీ ఆగం చేయాలి. అందులో టికెట్‌ ఆశించే వారిని బయటికి లాగాలి. వారి మధ్య వారికే చిచ్చు పెట్టాలి. అసమ్మతి, అంతర్గత గొడవలతో రచ్చకెక్కేలా రగడ చేయాలి. సమయం చూసి టికెట్‌ ఆశ చూపించాలని ప్రతిపక్ష పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. రెండు ప్రధాన పార్టీల టార్గెట్‌ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను బలహీన పర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లిd ఎన్ని కల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారికి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తీసుకువచ్చే ప్రయ త్నాలు సైతం సాగుతున్నాయన్న అనుమానాలను బీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులు సైతం వాటిని ధ్రువీకరిస్తున్నాయి.

కొత్త తరహా కుట్రలు
బీఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారిపై ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. 2018 ఎన్నికల్లో ఓటమి పాలై ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు సైలెంట్‌గా పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే గులాబీ లీడర్లు పార్టీ మారేందుకు ఇంట్రెస్ట్‌ చూపించకపోవడంతో కొత్త తరహా కుట్రలకు పాల్పడుతున్నారన్న చర్చ సాగుతోంది. ఎన్ని కల్లో గెలిచి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్న వారికి, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన మండల, నియోజకవర్గ స్థాయి నేతలతో ఘర్షణ, అంతర్గత కుమ్ములాటలు సాగేలా చూస్తున్నారన్న చర్చ నడుస్తోంది. వాస్తవానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, టికెట్‌ ఆశావాహుల మధ్య పెద్దగా గొడవలు లేకున్నా.. ఉన్నాయన్న చర్చ నడిసేలా కింది స్థాయి వారితో చేయిస్తున్నారన్న అనుమానాలను గులాబీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగ సభలకు ముందు లీకులు
రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు బహిరంగ సభలు, మీటింగ్‌లు, కార్యక్రమాలు ప్రకటిస్తుందే లేదో.. వెంటనే ఓ చర్చను తెర మీదకు తీసుకువస్తున్నారు. అధికార పార్టీ నుంచి చేరికలు ఉంటాయని ప్రతిపక్ష పార్టీల నేతలే లీకులు ఇస్తున్నారు. కొద్దిరోజులు మీడియాలో చర్చ సాగేలా చూసుకుంటున్నారు. ఫ్రీగా ఆ పార్టీకి మైలేజ్‌ వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. చివరకు ఈ సభలో చేరికలు లేవు.. వచ్చేసారి పెద్దఎత్తున ఉంటాయని చావు కబురు చల్లగా చెప్పినట్లు చెబుతు న్నారు. అసెంబ్లిd ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరో ఒకరు బీఆర్‌ఎస్‌ నుంచి చేరుతున్నారన్న ప్రచారాన్ని జోరుగా చేసే ప్రయ త్నాలు ఇప్పుడు ఇంకా ఎక్కువగా సాగుతున్నాయి. కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయా నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమకు పార్టీ సరైన గౌరవం ఇచ్చిన తర్వాత తాము ఎందుకు మారు తామని ఆ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే సొంత పార్టీ నుంచి ఇతర పార్టీలోకి ఆహ్వానిస్తే రాకపోవడంతో.. అక్కడ పొగ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లగొట్టే పరిస్థితులను తయారు చేసేందుకు గ్రౌండ్‌ లెవల్‌ నుంచి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రలను పసిగట్టడంలో కొంత మంది నేతలు వెనకబడిపోతున్నా రన్న వాదన ఉంది. అధిష్టానం అన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు వాస్తవం ఏది అని ఆరా తీస్తుంది.

ఈ జిల్లాల నేతలపై గురి
కొన్ని చోట్ల వర్గాలు ఉన్నాయన్న మాట వాస్తవమే అయినా.. పార్టీ లైన్‌కు కట్టుబడి ముందుకు సాగుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని కొందరు నేతలు, రంగారెడ్డి జిల్లాలో పేరొందిన ఇద్దరు, ముగ్గురు నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నా అవి పెద్దగా ప్రభావం చూపెట్టేలా లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లోనూ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తనతో పాటు పలువురిని ఇతర పార్టీలోకి తీసుకెళ్లేందుకు చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అధిష్టానం రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. జూపల్లి ప్రభావం కూడా పెద్దగా ఏమి ఉండదన్న అభిప్రాయాన్ని బీఆర్‌ఎస్‌ వ్యక్తం చేస్తోంది.

సైలెంట్‌ అయిన ప్రత్యర్థులు
రేపు అమిత్‌ షా చేవెళ్ల బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని లీకులు ఇచ్చారు. ఓ మాజీ మంత్రి, అతని కుటుంబం సభ్యులు కమలం గూటికి వస్తున్నారని ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు ఎవరూ పార్టీలో చేరడం లేదని అధికారికంగా చెబుతున్నారు. వాస్తవంగా మాజీ మంత్రి అనగానే అందరూ జూపల్లి అని మొదట అనుకున్నారు. కానీ ఆయన కాదని మళ్లి లీకులు ఇచ్చారు. తర్వాత ఆ చర్చ మాజీ మంత్రి , ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి మీదకు మళ్లింది. పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పలువురు కమలం కండువా కప్పుకోబుతున్నారని రాజకీయ వర్గాల్లోనే కాదు.. వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. చివరకు ఈ విషయంపై ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు ప్రత్యర్థులు సైలెంట్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement