Thursday, April 25, 2024

పల్లెల్లో విజృంభిస్తున్న కరోనా..

ప్రాణభయంతో జనాలు
పారిశుద్ధ్య నిర్వాహణలో సర్పంచులు
సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు

బెల్లంపల్లి : పల్లెల్లో కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రాణ భయంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కాలం సాగిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ కరోనా తీవ్రంగా ఉండటంతో పల్లెల్లో సరిగా నియమాలు పాటించకుండా అవగాహన లేకపోవడంతో కరోనా మహమ్మారి బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు, బెల్లంపల్లి, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నెన్నెల గ్రామాల్లో తీవ్రస్థాయిలో కరోనా కేసులు పెరగడం జరుగుతోంది. కాసిపేట మండలంలోని మల్కపల్లిలో 100కు పైగా, అదేవిధంగా తాండూరు మండలం అచ్చులాపూర్‌లో 100కు పైగా కేసులు నమోదు కావడంతో ఆయా గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు వనికిపోతున్నారు. నిత్యం వ్యాపారాలకు వెళ్లివచ్చే వారి నుండి, శుభకార్యాలకు వెళ్లివచ్చే వారి నుండి, మొన్నటికి మొన్న మాలదారణ చేసిన స్వాముల వల్ల కూడా కరోనా ఒకరి నుండి ఒకరికి తెలియకుండానే సోకడంతో పల్లెల్లో ఒకొక్క ఇంట్లో ఇద్దరి నుండి ఐదుగురికి కూడా కరోనా సోకిన ఇండ్లు ఎన్నో ఉన్నాయి. గ్రామాల్లో వైద్య సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు కరోనా విజృంభిస్తోంది. ఇది ఇలాఉండగా ఎప్పటికప్పుడు గ్రామాల్లో సర్పంచులు పారిశుద్ధ్యం పనులను సరైన సమయంలో చేయించకపోవడంతో కరోనా వ్యాప్తికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నారు. సర్పంచులంతా మేల్కొని గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచ్‌కారీ చేయించడంతో పాటు కరోనా సోకిన వారిని బయటకు వెళ్లకుండా కట్టడి చేయడం జరుగుతోంది. భౌతిక దూరం పాటిస్తూ నిబంధనలు పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చునని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో పల్లెల్లో యువకులు, మేథావులు, ప్రజాప్రతినిధులు తమ తమ గ్రామాలకు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ విధించుకోవాలని సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement