Friday, April 26, 2024

సింగరేణి ఐసోలేషన్‌ సేవలను వినియోగించుకోండి..

బెల్లంపల్లి : సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రంలో సేవలను నియోజకవర్గంలోని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి గడ్డం వినోద్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. నియోజకవర్గంలో బెల్లంపల్లి, తాండూరు, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, కాసిపేట మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పాజిటీవ్‌ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కారణంగా అనుమానం వచ్చిన ప్రతీఒక్కరు ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా పట్ల అవగాహన కల్పించకపోవడంతో కాసిపేట మండలంలోని రేగులగూడలో 56 మంది ఆదివాసీలకు కరోనా వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కళ్లు తెరిచి మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాల ప్రజలకు కరోనా ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని పెంచాలని, మారుమూల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వెంటిలేటర్లను వినియోగించేందుకు సరిపడా టెక్నీషియన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అయిన ఆసుపత్రి సిబ్బందికి మరిన్ని పీపీఈ కిట్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రజలంతా మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేసుకుంటూ కరోనా బారీన పడకుండా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement