Sunday, May 5, 2024

అప్పులే ఉరితాడై….న‌లుగురు రైతు కుటుంబ స‌భ్యుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

కాసిపేట -మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం మల్కేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జంజిరాల రమేష్‌ అనే రైతు కుటు-ంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు జంజిరాల రమేష్‌ (40), పద్మ (35), అక్షయ్‌ (17), సౌమ్య(19)గా గుర్తించారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి రైతు దంపతులు ఉరేసుకున్నారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటు న్నట్టు- రైతు రమేష్‌ లేఖ రాశాడు. కొన్నాళ్ళుగా జంజిరాల రమేష్‌ భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ”అప్పుల బాధ కు ఆత్మహత్య చేసుకుంటున్నాం. పోయిన ఏడాది, ఈ సంవత్సరం నష్టం వచ్చింది. అందులో కూతురు పెళ్లి చేశాను. అప్పులు ఎక్కువై అందరం ఆత్మహత్య చేసుకుంటున్నాం. నేను ఒక్కడిని లేకపోతే నా పిల్లలు, నా భార్య బతుకలేరు. మా ఆత్మహత్యలకు ఎవరూ కారణం కాదు. కౌలు రైతు పరిస్థితింతే” అని సూసైడ్‌నోట్‌ రాశాడు. కౌలు రైతు కుటుంబ సభ్యుల ఆత్మహత్య సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం, రోజు తెలవారకముందు అందరికంటే ముందే రమేష్‌ భార్య పద్మ(35) ఇంటి పనులు చేసేదని, గురువారం తెలవారినా ఇంటి నుండి ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్కింటి వారు రమేష్‌ ఇంటి తలుపు తెరిచి చూశారు. ఇంట్లో తాడుతో ఉరివేసుకుని మృతి చెందివున్న పద్మను చూసి వాడలోని వారు కంటతడి పెట్టారు. పద్మ ఉరివేసుకుని వున్న గదిలో నేలపై విగతజీవిగా పడివున్న వారి కూతురు సౌమ్య(19), మరో గదిలో రమేష్‌ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, పక్కనే మంచంలో వారి కుమారుడు అక్షయ్‌(17) విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానికులు దేవాపూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్పులే మరణానికి కారణం…
తమ చావుకు అప్పులే కారణమని తెలియచేస్తూ వున్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కౌలుకు భూములు తీసుకుని వ్యవసాయం చేసే రమేష్‌ గత రెండేళ్లుగా అనుకున్నమేర పంట దిగుబడులు లేక పెట్టుబడులు రాక మరింత అప్పుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. గత ఏడాది తన కూతురు సౌమ్య వివాహం చేసిన అప్పులు, వ్యవసాయానికి చేసిన అప్పులు దాదాపు 16 లక్షల రూపాయల వరకు వున్నట్టు సూసైడ్‌నోట్‌ పేర్కొన్నాడు. ఒక ఎకరం భూమి ఉన్నా.. దాన్ని అమ్ముకుని లేదా పది లక్షలు ఉన్నా బతికేవాళ్లం, మధ్యతరగతి బతుకులింతే, ఇజ్జత్‌ ఎక్కువ, అప్పుల కోసం నాలుగు ప్రాణాలు పోవడం జరిగింది. నన్ను తిట్టుకోకండి…” అంటూ సూసైడ్‌నోట్‌లో వేదనతో రాసిన మాటలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి.
ముందు పిల్లలు తర్వాతే రమేష్‌ దంపతులు
పదవ తరగతి చదువుకుంటున్న అక్షయ్‌, గత ఏడాది వివాహమై గర్భంతో వున్న కూతురు సౌమ్య మూడు రోజుల కిందే పుట్టింటికి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. అయితే ముందుగా పిల్లలను తాడుతో ఉరివేసి వారు చనిపోయాక కూతురును నేలపై ఒక గదిలో, కుమారుడిని మంచంపై మరో గదిలో వేసి అనంతరం భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement