Friday, May 17, 2024

బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం..

మంచిర్యాల : మంచిర్యాల మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50.38 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించింది. మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించి ఆ మేరకు బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశానికి ఎక్స్‌సఫిషియో సభ్యులు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్లికేరి, మున్సిపల్‌ కమీషనర్‌ స్వరూపరాణిలు హాజరు కాగా బడ్జెట్‌కు సంబంధించిన వివరాలను పాలకవర్గం ముందు ఉంచారు. గత ఆర్థిక సంవత్సరమైన 2020-21తో పోల్చితే రూ.9.67 కోట్లు అధికంగా బడ్జెట్‌ను రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం రూ.41.71 కోట్లను కేటాయించగా అందులో సగం మాత్రమే కట్‌ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఆధాయ రూపకంగా మున్సిపాలిటీకి రూ.50.38 కోట్లు వస్తుండగా ఆ ఖర్చును కూడా రూ.50.38 కోట్లతోనే రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం మిగిలిన నిల్వ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ నిల్వగా రూ.18.01 కోట్లుగా సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆధాయానికి సంబంధించి పన్నుల రూపకంగా రూ.14.04 కోట్లు, పన్నేతర ఆదాయ వనరులైన అద్దె రూపకంగా రూ.4.98 కోట్లను, ప్రజారోగ్యం, పారిశుద్ద్య విభాగం రషీదుల రూపేనా రూ.44.30 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం నిధుల కింద రూ.3.13 కోట్లు, ఇతర నిధుల కింద రూ.4.68 కోట్లుగా బడ్జెట్‌లో చూపించారు. మొత్తం కలుపుకొని రూ.50.38 కోట్ల రూపాయల ఆధాయం వస్తున్నట్లు బడ్టెట్‌ను రూపొందించారు. ఖర్చుల పద్దు కింద వేతనాలు, పారిశుద్ధ్య నిర్వాహణ వ్యయం, విద్యుత్‌ చార్జీలు, రుణాల తిరిగి చెల్లింపు, గ్రీన్‌ బడ్టెట్‌ వ్యయం కలుపుకొని రూ.17.5 కోట్లుగా ఇంజనీరింగ్‌ విభాగం నిర్వాహణ వ్యయం సాధారణ పరిపాలన వ్యయం, పట్టణ ప్రణాళిక విభాగం ఖర్చును కలుపుకొని రూ.3.29 కోట్లుగా చూపించారు. ప్రజా సౌకర్యాల ఖర్చు కోసం రూ.10.68 కోట్లు, వార్డుల వారీగా అభివృద్ధి పనులకు రూ.4.82 కోట్లు, డిపాజిట్లు, రుణాలు రూ.30లక్షలు, నాన్‌ ప్లాన్‌ నిధుల కింద రూ.11.71 కోట్లు, ప్రణాళిక నిధుల కింద రూ.4.68 కోట్లుగా చూపించారు. 1/3 బడ్జెట్‌ బ్యాలెన్స్‌ వ్యయం కింద రూ.3.25 కోట్లను చూపిస్తూ మొత్తం ఖర్చును రూ.50.38 కోట్లుగా అంచనాలను రూపొందించగా పాలకవర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగా బడ్జెట్‌ను రూపొందించినప్పటికీ ఆ మేరకు ఖర్చు చేయడంలో పాలకవర్గాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చు కాకుండానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా పేరు ఎన్నిక కన్న మంచిర్యాల మున్సిపాలిటీ నేడు రాష్ట్రంలో దిగజారిన మున్సిపాలిటీగా
మారింది. దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు మౌళిక వసతుల కల్పనతో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. నిధులు ఉండి ఆ మేరకు ఖర్చు చేయకపోవడం ద్వారానే అభివృద్ధి జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా సంవత్సరాల తరబడి పనులు జరుగక గ్రాంట్ల రూపేన వచ్చిన నిధులు తిరిగి ప్రభుత్వానికి వెళ్లిపోతున్నాయి. ఇకనైనా పాలకవర్గం సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలని, బైపాస్‌ రోడ్ల నిర్మాణాలతో పాటు మౌళిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తే తప్ప మంచిర్యాల మున్సిపాలిటీ గత వైభవాన్ని పొందే పరిస్థితులు కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement