Sunday, April 28, 2024

TS : ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి…ఆదివాసుల ఆగ్రహం…

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడి గూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న తొడసం మహేశ్వరి(12) విష జ్వరంతో అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ లో ఆందోళనకు దారి తీసింది. బాలిక మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆదివాసులు చేపట్టిన ఆందోళన అట్టుడికింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన బాలిక తొడసం మహేశ్వరి మామిడి గుడ ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది. గత వారం రోజులుగా తీవ్ర జ్వరం, రక్తహీనతతో బాధపడుతున్నా ఆశ్రమ పాఠశాల హెచ్ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించగా పరిస్థితి విషమించడంతో మూడు రోజుల క్రితం అంకోలి ఆసుపత్రిలో చికిత్స అందించారు. బాలిక పరిస్థితి గురించి తల్లిదండ్రులకు వాకబు చేయకుండా ప్రాణాపాయ స్థితిలో ఇంటికి పంపించగా వెంటనే తండ్రి రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు రిమ్స్ ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆదివాసి చిన్నారి మృతికి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం, ఏటీడీఓ, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ వారిని సస్పెండ్ చేయాలని, బాలిక కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలికమృతదేహంతో రిమ్స్ ఆస్పత్రి ఎదుట ప్రధాన రోడ్డుపై రెండున్నర గంటలు బైఠాయించడంతో భారీ ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ రిమ్స్ ఆస్పత్రికి చేరుకొని జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పై వెంటనే విచారణ జరిపించి బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని, బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసి సంఘాలు ఆందోళన విరమించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement