Friday, May 10, 2024

ట్రాక్టర్ ని ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం.. మరికొందరి పరిస్థితి విషమం

రాంగ్ రూట్ లో వెళ్తోన్న ట్రాక్టర్ ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్‌ ఎడమకాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం అర్ధరాత్రి 12 గంటల సయంలో ట్రాక్టర్‌లో తిరుగుపయాణమయ్యారు. అయితే యూటర్న్‌ అయప్ప ఆలయం నుంచి కిలోమీటరున్నర దూరం ఉండటంతో దూరాన్ని తగ్గించుకోవడానికి.. డ్రైవర్‌ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విజయజవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్సులు, అందుబాటులో ఉన్న వాహనాల్లో దవాఖానకు తరలించారు. తీవ్రగాయాలైనవారిని ఖమ్మం, సూర్యాపేటలోని హాస్పిటళ్లకు తరలించగా, స్వల్పంగా గాయపడినవారికి కోదాడ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మృతులను తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, ఉదయ్‌ లోకేష్‌, నారగాని కోటయ్య, గండు జ్యోతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 38 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement