Wednesday, May 8, 2024

త‌ల్లిదండ్రులుగా మారిన అత్త‌మామ‌లు – కోడ‌లికి మ‌రో పెళ్లి-గిఫ్ట్ గా రూ.60ల‌క్ష‌ల భ‌వ‌నం

ఓ ప‌క్క కోడ‌ళ్ల‌ని రాచి రంపాన పెడుతున్నారు ప‌లువురు అత్తామామ‌లు. అయితే అందుకు భిన్న ఈ అత్త‌మామ‌లు. క‌రోనాతో భ‌ర్త‌ను కోల్పోయిన ఓ మ‌హిళ‌కి అండ‌గా నిలిచి అత్తామామ‌లే ద‌గ్గ‌రుండి పెళ్లి చేశారు. అంతే కాదు.. రూ. 60 లక్షల విలువైన ఆస్తిని రాసిచ్చారు అత్తమామలు. మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాకు చెందిన యుగ్ ప్రకాశ్ తివారీ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్. ఈయనకు భార్య, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. ప్రియాంక్ తివారీకి భార్య రీచా, కూతురు అనన్య తివారీ(9) ఉన్నారు. కరోనాతో ప్రియాంక్ తివారీ గతేడాది చనిపోయాడు. అప్పట్నుంచి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రీచా తన భర్త గురించే ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోతుండటాన్ని యుగ్ ప్రకాశ్ గమనించాడు. యుగ్ ప్రకాశ్ దంపతులు కోడలు రీచాను కూతురిలా భావించారు. ఆమె కొత్త జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించారు. దీంతో రీచాకు మరో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన వరుణ్ మిశ్రాతో రీచాకు దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అది కూడా అక్షయ తృతీయ రోజున వివాహం జరిపించి.. కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నాగ్‌పూర్‌లో ప్రియాంక్ తివారీ కొనుగోలు చేసిన ఓ భవనాన్ని( రూ. 60 లక్షల విలువ) రీచాకు బహుమతిగా ఇచ్చారు. రీచా భవిష్యత్‌లో ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతోనే ఆ భవనం రాసిచ్చామని యుగ్ ప్రకాశ్ దంపతులు తెలిపారు. వివాహం అనంతరం వరుణ్ మిశ్రాతో కలిసి రీచా, కూతురు అనన్య నాగ్‌పూర్ వెళ్లిపోయారు. కోడలికి మరో పెళ్లి చేసిన యుగ్ ప్రకాశ్ దంపతులపై ప్రశంసల జ‌ల్లు కురుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement