Saturday, May 4, 2024

వలసొచ్చి వల్లకాటికి, బుగ్గిపాలైన కూలీలు.. 11మంది సజీవ దహనం

తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్​లోని బోయిగూడలో ఇవ్వాల తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, బిహార్‌ సీఎం నితీష్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్‌ అంబులెన్స్‌లో 24వ తేదీ గురువారం వారి స్వస్థలాలకు మృతదేహాలు పంపించనున్నట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌/సికింద్రాబాద్‌/బోయిగూడ, ఆంధ్రప్రభ: బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వచ్చిన వలస కూలీల బతుకులు బుగ్గిపాలయ్యాయి. రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని పొట్టపోసుకునే శ్రమ జీవులను అగ్నిప్రమాదం కాల్చి బూడిద చేసేసింది. సికింద్రాబాద్‌ బోయిగూడలో బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగటంతో 11మంది కూలీలు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అగ్నిప్రమాదంపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది 8 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అతికష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో బోయిగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సికింద్రాబాద్‌ బోయిగూడ ఐడీహెచ్‌ కాలనీలోని శ్రవణ్‌ ట్రేడర్స్‌ స్క్రాప్‌ గోదాంలో బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో పనిచేస్తున్న 12మంది కార్మికులు మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కార్మికులు గాడనిద్రలో ఉండగా గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందుగా తుక్కుగోదాములో మంటలు చెలరేగి… పైనున్న టింబర్‌ డిపోకు వ్యాపించాయి. డిపో నిండా కట్టెలు ఉండటంతో మంటలు వేగంగా గోదాం అంతా వ్యాపించాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి 5 ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. అప్పటికే గోదాంలో ఉన్న గ్యాస్‌ సిలెండర్‌ పేలడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. స్క్రాప్‌ దుకాణానికి చెందిన గోదాం కావటంతో పేరుకుపోయిన వందల కిలోల చెత్త కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అదనంగా మరో మూడు ఫైరింజన్లు రప్పించిన అధికారులు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 11 మంది కార్మికులు మృతిచెందారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించినా.. ఒకరు మాత్రమే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగారు. మిగిలిన 11మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతుల్లో కొందరు అగ్నికీలలకు ఆహుతి కాగా… మరికొందరు దట్టమైన పొగలదాటికి ఊపిరాడక ప్రాణాలు విడిచారు.

మృతులంతా బిహార్‌ వలసకూలీలే..
బోయిగూడ అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారంతా బీహార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వలస కూలీలేనని తెలుస్తోంది. మృతులంతా బీహార్‌ రాష్ట్రంలోని చప్రా జిల్లాకు చెందిన వారు. ప్రమాద ఘటనలో 11 మంది కూలీల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మాంసం ముద్దలుగా మిగిలాయి. రోజంతా కష్టపడి… రేపటి మీద ఆశతో అలసిపోయి మంగళవారం రాత్రి నిద్రించిన వాళ్లకు మంగళవారం రాత్రే ఆఖరి రాత్రి అయింది. పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇవ్వటం కోసం ఎండనక, వాననక కష్టపడి జీవిస్తున్న కార్మికులు, వారి పిల్లలు అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు ప్రాణాలు కోల్పోయిన వారిలో బిట్టు (23), సికిందర్‌ (40), దినేష్‌ (35), దామోదర్‌ (27), చింటు (17), సికిందర్‌ (35), రాజేష్‌ (25), రాజు (25), దీపక్‌ (26), పంకజ్‌ (26), గోలు (25)గా గుర్తించారు. ప్రమాద ఘటన నుంచి బయటపడిన ప్రేమ్‌ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మృతులంతా 30ఏళ్లలోపు వారే
మృతులంతా 30 ఏళ్లలోపు వారే కావటంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పది రోజులలో ఇంటికి వస్తామని బిహార్‌లోని తమ కుటుంబ సభ్యులకు చెప్పి… అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మృతిచెందిన కూలీలంతా రెండేళ్లుగా ప్రమాదం జరిగిన గోదాంలో పని చేస్తున్నారు. వీరిలో కొంతమందికి వివా#హం కాగా మరికొంతమంది అవివాహితులు కూడా ఉన్నారు. ప్రాణాలు విడిచిన కార్మికులంతా నెలకు రూ. 12 వేల జీతానికి పని చేస్తున్నారు.

- Advertisement -

ఎంట్రీ, ఎగ్జిట్‌ ఒక్కటేకావటంతో పెరిగిన ప్రమాద తీవ్రత…
బోయిగూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న శ్రవణ్‌ ట్రేడర్స్‌ స్క్రాప్‌ గోదాంకు ఎంట్రీ, ఎగ్జిట్‌ ద్వారాలు వేర్వేరుగా లేకపోవటంతో ప్రమాద ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. గోదాం విస్తీర్ణం సుమారు వెయ్యి గజాలలో ఉన్నప్పటికీ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒక్కటే ద్వారం ఉంది. బుధవారం తెల్లవారు జామున షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ముందుగా ప్రవేశ ద్వారం వద్దనే మంటలు చెలరేగటంతో కార్మికులకు తప్పించుకునే మార్గం లేకపోయింది. దీంతో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు గోదాంలో పెద్ద ఎత్తున ఉన్న సీసాలు, ఇతర ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు మంటలు అంటుకోవటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

గోదాంకు ఎలాంటి అనుమతులు లేవు
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న షెడ్డుకు ఫైర్‌ విభాగం నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. దీనికి తోడు లోపలి భాగంలో ఎలాంటి అగ్ని ప్రమాద రక్షణ చర్యలు లేవు. జీ##హచ్‌ఎంసీ, కార్మిక విభాగాల నుండి కూడా ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. గాంధీ నగర్‌ పోలీసులు గోదాం యజమాని సంపత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా.. : సీఎస్‌ సోమేష్‌ కుమార్‌
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా అందించనున్నట్లు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ప్రకటించారు. మృతదేహాలను వారి సొంతూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎస్‌.. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. గోదాంకు ఉన్న అనుమతులను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా… మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 2 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించింది.

ఎయిర్‌ అంబులెన్స్‌లో స్వస్థలాలకు మృతదేహాలు: హోంమంత్రి
బోయగూడ అగ్నిప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ పరిశీలించారు. గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. ఆరుగురి మృతదేహాల గుర్తింపు పూర్తయిందన్నారు. మిగతా మృతదేహాల గుర్తింపు జరగాల్సి ఉందన్నారు. మృతదేహాలను ఎయిర్‌ అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపిస్తామని వెల్లడించారు. అనధికరికంగా ఉన్న గోదాంలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం: మంత్రి తలసాని
ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని తెలిపారు. ఘటనకు సంబంధించి గోదాం యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. తెల్లవారు జామున 4 గంటలకు ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు కొద్దిగా ఆలస్యమయినట్లుగా తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. ఘటనకు కారణాలు దర్యాప్తులో తెలుతాయన్నారు. దర్యాప్తు నివేదిక అందగానే చర్యలు చేపడతామన్నారు.

గుర్తుపట్టలేనంత కాలిపోయాయి..: గాంధీ సూపరిండెంట్‌ డా. రాజారావు
అగ్నిప్రమాద మృతుల్లో ఇద్దరు మినహా మిగతా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి పోయాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం కోసం నాలుగు వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం సమయంలో గాంధీ ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వద్ద అదనపు బలగాలతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

తుక్కు సామానుతోనే పెరిగిన ప్రమాద తీవ్రత: సీపీ ఆనంద్‌
గోదాంలోని కింది ఫ్లోర్‌లో ఉన్న తుక్కు సామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని సీపీ ఆనంద్‌ తెలిపారు. గోదాముకు ఎలాంటి అనుమతులు లేవని, లోపల ఎలాంటి ప్రమాద నివారణ జాగ్రత్తలు కూడా లేవన్నారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement