Tuesday, April 30, 2024

Uttarakhand Results: ఉత్తరాఖండ్‌లో వార్ వన్ సైడ్.. దూసుకెళ్తున్న బీజేపీ.. వెనుకంజలో సీఎం!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ లో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. వార్ వన్ సైడ్ గా మారిపోయింది. రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలు ఉండగా..ఇప్పటికే మెజార్టీ మార్క్ ను దాటేసింది. అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఉత్తరాఖండ్‌లో 48 స్థానాల్లో ముందంజలో ఉంది, మొత్తం 70 సీట్ల అసెంబ్లీలో అవసరమైన మెజారిటీ కంటే 12 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే 50 స్థానాల్లో గెలుపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కేవలం 18 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఇతరులు మాత్రం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ లో మరోసారి అధికారం దక్కించుకోనుండటంతో కమలనాథులు సంబర పడిపోతున్నారు.

2000లో రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఏ పార్టీని అధికారాన్ని రెండోసారి కొనసాగించలేదు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి ఒక రకమైన రికార్డుగా మారనుంది. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కాంగ్రెస్ అభ్యర్థి హరీష్ రావత్ వెనుకంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 59.51 శాతం ఓటింగ్ నమోదైంది. 2017లో మోదీ వేవ్‌తో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 57 గెలుచుకోగా, కాంగ్రెస్‌ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement