Sunday, May 5, 2024

వైఎస్ఆర్టీపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య పక్క పార్టీల వైపు చూస్తున్నారా? వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లో చేరాలని భావిస్తున్నారా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో భేటి అయ్యారు. అయితే ఆయన భేటి వెనక ఏదైన రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే చర్చ కొనసాగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన రాజయ్య.. గత కొంత కాలంగా టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృపితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య గ్యాప్ కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో భేటీ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్టీపీని ఏర్పాటు చేసిన షర్మిల పార్టీలో పేరున్న నాయకులు ఎవరు లేరు. షర్మిల తప్ప చెప్పకోదగిన నేత పార్టీలో లేకపోవడం మైనస్ గా మారింది. పెద్ద ఎత్తున పార్టీ అవిర్భావం జరిగినప్పటికి షర్మిల మినహా చరిష్మా ఉన్న నేతలెవరు కనిపించడం లేదు. దీంతో ఆపార్టీ బలోపేతానికి పావులు కదుపుతోంది.ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను ఆహ్వానించేందుకు తెర వెనుక ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

 వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన రాజయ్య ఆ తర్వాత కూడా టీఆర్ఎస్‌లోకి చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం డిప్యూటి సీఎంగా కూడా అవకాశం దక్కినా.. అనివార్యకారణాల వల్ల ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన నియోజకవర్గానికే పరిమతమయ్యారు. ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో కడియంకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ డౌటే అన్న ప్రచారం విపరీతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే రాజయ్య ఇతర పార్టీల వైపు చూస్తున్నారని తెలుస్తోంది. వైఎస్‌కు సన్నిహితంగా మెలిగిన వారిలో రాజయ్య ఒకరు. ఈ క్రమంలోనే ఆయన వైఎస్ఆర్ టీపీలోకి వెళ్లెందుకు సన్నద్దం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: మోదీ బొమ్మతోనే ఉచిత రేషన్‌ పంపిణీ: నిర్మలా

Advertisement

తాజా వార్తలు

Advertisement