Saturday, April 27, 2024

ఆర్టీసీకి రవాణా శాఖ షాక్‌.. కాలంచెల్లిన బస్సులు తిప్పొద్దంటూ ఆదేశాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ షాక్‌ ఇచ్చింది. దీంతో బస్సుల సంఖ్య మరింత తగ్గిపోనుంది. కేంద్ర రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలలో భాగంగా 15ఏళ్లు దాటిన బస్సులను నడపొద్దంటూ రాష్ట్ర రవాణా శాఖ ఇచ్చిన నోటీసులతో బస్సుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. సంస్థ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో గత కొన్నేళ్ళుగా యాజమాన్యం పాత బస్సులకు పైపై మెరుగులు దిద్ది రోడ్లపై తిప్పుతోంది. ఏ బస్సు ఎక్కడ ఏ క్షణంలో ఆగిపోతుందో తెలియని పరిస్థితులలో అధికారులున్నారు. ఈ నేపథ్యంలో ఉరుము లేని పిడుగు తరహాలో రవాణా శాఖ 15 సంవత్సరాలు పైబడిన వాహనాలను తిప్పేందుకు వీలు లేదంటూ నోటీసులు జారీ చేయడంలో ఏం చేయాలో పోలుపోని పరిస్థితిలో అధికారులున్నారు.

గత ఏడాది లెక్కల ప్రకారం 97 డిపోల పరిధిలో 9,708 బస్సులు తిరిగాయి. ఇందులో 3,107 అద్దె బస్సులున్నాయి. కాలం చెల్లినందున సంస్థ సొంత బస్సుల్లో దాదాపు మూడు వేల బస్సులు పక్కన పెట్టాల్సి ఉంటోంది. వీటి స్థానంలో 500 ఎలక్ట్రికల్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే సంస్థ తీవ్రమైన బస్సుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మరో రెండున్నర వేల బస్సులను పక్కకు పెడితే ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఎలా కల్పించాలన్న సంశయంతో అధికారులున్నారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం యాజమాన్యం గడచిన రెండేళ్ళుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తోంది. అయితే ఆ ప్రతిపాదనలకు మోక్షం వస్తే తప్ప కొత్త బస్సులను సమకూర్చుకునేందుకు వీలు లేదు. మరో పక్క అద్దె బస్సులను పెంచుకుందామంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని అధికారులు అంటున్నారు.

17 డిపోలకు మంగళం
సంస్థకు ఉన్న బస్సులు, వాటి కండిషన్‌పై ఎండీ సజ్జనార్‌ ఇటీవల రివ్యూ చేశారు. మొత్తం 97 డిపోల వారీగా మొత్తం బస్సులు, తిరుగుతున్న రూట్లు, సిబ్బంది, ఆదాయం, నష్టంతో పాటుగా డిపోకు ఉన్న భూముల గురించి సమగ్రంగా వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. లాభ, నష్టాల ఎజెండా ప్రాతిపదికగానే సజ్జనార్‌ ఈ రివ్యూలు చేసినట్టు సమాచారం. 97 డిపోలు కూడా నష్టాల్లోనే ఉన్నాయని, కొన్నింటిలో నష్టాలు మూడింతలుగా ఉన్నట్టుగా తేలింది. ఫలితంగా మొదట కొన్ని డిపోలను మూసేసి అక్కడి సిబ్బందిని వేరే డిపోల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కోరుట్ల లేదా మెట్‌పల్లి, హుజురాబాద్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌-2 లేదా #హన్మకొండ డిపో, నార్కెట్‌పల్లి డిపోలను మూసేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ డిపోలకు చెందిన బస్సులను ఈ మధ్యే పక్క డిపోలకు పంపించారు. అలాగే ఒక్కో డిపోలో కనీసం 121 బస్సులు ఉండాల్సి ఉండగా వాటిని 80కి కుదించారు. వీటిలో కాలంచెల్లిన బస్సులు సగంవరకు ఉన్నాయని కార్మికులంటున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో #హదరాబాద్‌3, మియాపూర్‌ డిపోలను మూసేశారు. ఈ మధ్యే పికెట్‌ డిపో క్లోజ్‌ అయినట్టు సమాచారం. ఎక్కువ నష్టాలు వస్తున్న 17 డిపోలను మొదటి విడతలో మూసేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా నష్టాలు, కాలం చెల్లిన బస్సులు, రవాణా శాఖ నిబంధనలు తెలంగాణ ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement