Friday, May 3, 2024

Time for Transfers – ఇక ఎన్నిక‌ల బ‌దిలీల‌కు రంగం సిద్ధం…

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : ఎన్నికల బదలీలకు ముహూర్తం ఖరారైంది. ఉద్యోగ బదలీలపై చర్చ జోరందుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఎన్నికలు రానున్నాయనే అంచనాలు, ఎన్నికల కమిషన్‌ వేగం పెంచిన తీరుతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2018లో ఎన్నికలకు స్వల్ప ముందస్తుగా పెద్ద ఎత్తున ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను, పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదలీలు చేసింది. ఇప్పుడు మళ్లిd అటువంటి పరిస్థితే పునరావృత్తం కానున్నదని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం అదనపు సీఈవోగా, జాయింట్‌ సీఈవోలుగా లోకేష్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లను బదలీ చేయడంతో ఒక్కసారిగా చర్చ జరుగుతోంది. కాగా గడచిన రెండు నెలలుగా ఐఏఎస్‌లు మొదలుకొని కిందిస్థాయిలో అన్ని శాఖల ఉద్యోగుల బదలీలపై విస్తృత చర్చ జరుగుతూ వచ్చింది. ప్రధానంగా ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న రెవెన్యూ శాఖలో బదలీల ఫైల్‌ కదిలినట్లుగా ప్రచారం జరిగినప్పటికీ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో అన్ని శాఖల బదలీలకు వీలుగా ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కనపెట్టినట్లు తెలిసింది. ఈ ఏడాదిలో ముంచుకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఐఏఎస్‌లపై విస్తృత కసరత్తు చేస్తోంది. తమకు విధేయులు అనుకున్నవారికి ఫోకల్‌ పాయింట్లలో నియమించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వినికిడి. త్వరలో జరగనున్న బదలీల్లో సీఎం కేసీఆర్‌ మార్క్‌ స్పష్టమవనున్నదని, పూర్తిగా ఎన్నికల టీమ్‌ ప్రతిఫలించనున్నదని సమాచారం. ఇక సాధారణ బదలీలకు వీలుగా షెడ్యూల్‌ కాకుండా ఒకేసారి జీవోల జారీ దిశగా జాబితాలు సిద్దమైనట్లు సమాచారం.

చెడ్డపేరు లేకుండా…పారదర్శకతే ప్రధానంగా…
ప్రభుత్వానికి తక్షణం క్షేత్రస్థాయిలో పథకాల అమలుతోపాటు ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకంగా వ్యవహరించే అధికారుల అవసరం నెలకొంది. ప్రభుత్వాల పనితీరు, ప్రజల్లో ఆదరాభిమానాలకు పాలనలో కీలకమైన ఉన్నాతాధికారుల ప్రవర్తనే కీలక ఫీడ్‌బ్యాక్‌గా నిలుస్తున్నది. దీనిని పరిగణలోకి తీసుకునే అస్మదీయులు, అయినవారు, సమర్ధులకు ఎన్నికల ఏడాదిలో కీలక పోస్టింగ్‌లను ఏ ప్రభుత్వమైన కట్టబెట్టడం ఆనవాయితీ. అయితే సీఎస్‌ సోమేస్‌ కుమార్‌ తీసుకున్న అనేక నిర్ణయాలు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. ధరణి రైతుల్లో తీవ్ర అసంతృప్తిని మిగల్చగా, కలెక్టర్లు కీలక జిల్లాల్లో అవినీతిపరులుగా మారినట్లు ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదులందాయి. ఇక జీవో 317 ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు చుక్కలు చూపించింది. స్వయంగా సీఎస్‌ ఎటువంటి అప్పీళ్లకూ ఆస్కారం ఇవ్వకుండా వ్యవహరించారు. ఇటువంటి చర్యలు సహజంగానే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తాయి. అయితే ఎన్నికల ఏడాదిలో వీటన్నింటినీ రూపుమాపేలా ప్రభుత్వ పాలనా వ్యవస్థ సెట్‌ చేసుకోవాల్సిన అసరం అనివార్యం. ఈ నేపథ్యంలో తాజా బదలీలకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తోంది.

ఎన్నికలకు ముందు జరుగుతున్న బదలీలు కావడంతో ప్రభుత్వం క్షణక్షణం అప్రమత్తతతో ఐఏఎస్‌ల పనితీరుపై ఇంటలిజెన్స్‌ శాఖద్వారా వివరాలను సేకరించింది. ఐఏఎస్‌లపై పూర్తిగా సమగ్ర సమాచారాన్ని రెడీ చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే 18కిపైగా జిల్లాల కలెక్టర్లపై ఉన్న ఆరోపణలను విచారించి తక్షణమే ఇందులో మెజార్టీ సంఖ్యలో కలెక్టర్లకు స్థానచలనం తప్పకపోవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా పలు జిల్లాల ఎస్పీలను కూడా బదలీలు చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌లో 159 మంది ఉండగా 10మంది వరకు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. విశ్వాస పాత్రులకు ఫోకల్‌ పోస్టింగ్‌లు, అంతగా పొసగని అధికారులకు నాన్‌ ఫోకల్‌ పోస్టులతో జాబితా సిద్దమవుతోందని తెలిసింది. ఈ తరహా బదలీల్లో స్పెషల్‌ సీఎస్‌ హోదాలో, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్లు, కలెక్టర్లు వంటి అన్ని స్థాయిల్లో బదలీలు జరగనున్నాయి. ఇప్పటిరకు సేకరించిన సమాచారం ఆధారంగానే పోస్టింగ్‌లు దక్కనున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వానికి సన్నిహితులుగా పేరున్న అధికారులతోపాటు, కన్ఫర్డ్‌ ఐఏఎస్‌లకు, అదనపు కలెక్టర్‌లుగా పనిచేస్తున్న తాజా క్యాడర్‌ జూనియర్లకు కీలక పోస్టులు దక్కానున్నాయని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

అన్ని శాఖల్లోనూ…
ఎన్నికల ఏడాదిలో ఉద్యోగ సంక్షేమంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం సమస్యల నివారణలో భాగంగా త్వరలో ఉద్యోగ బదలీలకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో అనివార్యంగా బదలీలు చేపట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అంతా బిజీగా ఉండే అవకాశం నేపథ్యంలో పాలనకు కీలకమైన ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లతోపాటే సాధారణ ఉద్యోగ బదలీలను చేపట్టాల్సి ఉంది. వాస్తవానికి నిబంధన మేరకు మూడేళ్లకోసారి సాధారణ బదలీలను విద్యా ఏడాదికి ఆటంకాలు లేకుండా చేపట్టాలని భావిస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెండింగ్‌లోనే…
రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఒక్కసారి మినహా పూర్తిస్థాయి బదలీలు జరగలేదు. దీంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగుల వివరాలను, ఇటీవలే పూర్తి చేసిన సర్దుబాట్లు, స్థానికత, కొత్త ఉద్యోగాల భర్తీ, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదికలను సిద్దం చేసింది. మూడేళ్ల సర్వీస్‌ను ఒకోచేట పూర్తి చేసుకున్న అందరు ఉద్యోగులకు స్థానచలనం కల్గించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలో సీఎం కేసీఆర్‌ ఆమోదంతో ఈ అంశాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని శాఖల్లో బదలీలను పూర్తిచేసే లక్ష్యంతో త్వరలో కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.
తెలంగాణ సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఆరంభించింది. తెలంగాణ, మిజోరం, చత్తస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సీఎస్‌లకు, ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో బదలీలు, పోస్టింగ్‌లను చేపట్టాలని ఈ లేఖలో ఆదేశించింది. తెలంగాణకు వచ్చే ఏడాది జనవరి 16 వరకు గడువు ఉండగా ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలతో సంబంధం ఉన్న రెవెన్యూ, పోలీస్‌: శాఖలు సహభా ఇతర ఉద్యోగులు సొంత జిల్లాల్లో ఉండకుండా బదలీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా తమ సొంత జిల్లాల్లో కొనసాగరాదని స్పష్టం చేసింది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే బదలీ చేయాలని కోరింది. పదోన్నతుల సర్వీసును కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేసే యోచనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల బదలీలకు వీలుగా ఆఘమేఘాలమీద ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో నేరుగా సంబంధం ఉండి, ఈ ప్రక్రియకు కారకులయ్యే ప్రభుత్వ శాఖల్లో బదలీల పరంపరను పూర్తిచేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. కాగా ఎన్నికలతో సంబంధం ఉన్న జిల్లా కలెక్టర్లు, జేసీలు, రిటర్నింగ్‌ అధికారులు, ఈఆర్వోలు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల నోడల్‌ అధికారులు, డిప్యుటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారులకు బదలీ మార్గదర్శకాలు అమలయ్యేలా ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది. అదేవిధంగా ఎన్నికలతో సంబంధం ఉండి, బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యే ఐజీ, డీఐజి, రాష్ట్ర సాయుధ బలగాల కమాండెంట్లు, ఎస్సీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, స్టేషన్‌ హౌజ్‌ అధికారులు, సీఐలు, ఎస్సైలు, రిజర్వ్‌ సీఐలకు కూడా ఇవే ఉత్తర్వులు వర్తించనున్నాయి.
బదలీల మార్గదర్శకాల్లో భాగంగా ఈసీ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులెవరూ సొంత జిల్లాల్లో లేకుండా చూడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అమలులోకి తెస్తూ ఎన్నికలతో సంబంధం ఉండే శాఖలకు సమాచారం చేరవేసింది. గడచిన నాలుగేళ్లకాలంలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న అధికారులను బదలీ చేయాలని ఆదేశించింది. బదలీల్లో భాగంగా ఎవరినీ సొంత జిల్లాలకు పంపకూడదని నిర్ధేశించింది. గత అసెంబ్లిd ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఏదైనా అసెంబ్లిd నియోజకవర్గం, జిల్లా పరిధిలో పనిచేసిన జిల్లా ఎన్నికల అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, పోలీస్‌ సీఐలు, ఎస్సైలు, ఆపై స్థాయి హోదా ఉన్న అధికారులెవరూ అదే నియోజకవర్గం, జిల్లాలో పనిచేయకుండా చూడాలని సూచించింది. ఈ బదలీలు గడువులోగా పూర్తిచేయాలని కూడా పేర్కొంది. ఈ ఉత్తర్వుల అమలులో ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి మినహాయింపులు పొందే వెసులుబాటును కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement