Saturday, April 27, 2024

Nitish Kumar: మందు తాగేవాళ్లంతా మహా పాపులు: బీహార్ సీఎం

బీహార్ లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కల్తీ మద్యం, కల్తీ సారాయి విరివిగా దొరుకుతోంది. ఈ కల్తీ మద్యంతో రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మందు తాగేవాళ్లంతా మహా పాపులు అని ఆయన వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం, సారాయి తాగడం వల్ల మృతి చెందే వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని, వారి కుటుంబాలకు ఎలాంటి సాయం అందజేయదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నవారు ముమ్మాటికీ మహా పాపులేనని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను తాను భారతీయులుగా గుర్తించనని చెప్పారు. మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది దాన్ని సేవిస్తున్నారని… దీని వల్ల జరిగే పర్యవసానాలకు వారే బాధ్యులని తెలిపారు. మందు విషంతో సమానమని తెలిసినా తాగుతున్నారని మండిపడ్డారు.

బీహార్ అసెంబ్లీ నిన్న రాష్ట్రంలో మొదటిసారిగా మద్య నిషేధాన్ని కఠినతరం చేయడానికి ఉద్దేశించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement