Sunday, May 5, 2024

Enquiry: ఆ మూడు టేబుళ్లు, అక్కడే డ్రగ్స్‌ ఆనవాళ్లు.. హైదరాబాద్‌ పబ్‌ పార్టీ కేసులో పురోగతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ పబ్‌లో డ్రగ్స్‌ కేసులో పబ్‌ యజమాని ఉప్పల అభిషేక్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పబ్‌ మేనేజర్‌ అనిల్‌ బర్త్‌ డే పార్టీకి వచ్చిన యువతీ యువకులకు డ్రగ్స్‌ను అందించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పార్టీ కోసం పబ్‌లోని ఓ మూల చీకటి ప్రదేశంలో మూడు టేబుళ్లను ఏర్పాటు చేశారని, ఈ పార్టీలో దాదాపు 20 మంది దాకా పాల్గొన్నట్టు బంజారాహిల్స్‌ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన వివరాలను బట్టి తెలుస్తోంది. పబ్‌ యజమాని ఉప్పల అభిషేక్‌ కూడా ఈ పార్టీలో స్వయంగా పాల్గొని డ్రగ్స్‌, మద్యాన్ని సరఫరా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసిన తర్వాత జరిపిన సోదాలో 4.5 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. ఈ డ్రగ్‌ను కొకైన్‌గా ల్యాబ్‌ అధికారులు నిర్ధారించి నివేదికను పంపించినట్టు తెలుస్తోంది. బర్త్‌ డే పార్టీలో పాల్గొన్న యువతీ యువకులకు ఉప్పల అభిషేక్‌ డ్రగ్స్‌ను తెప్పించినట్టు సమాచారం. ఈ డ్రగ్స్‌ ఎవరు తెచ్చారు, పబ్‌లో ఎవరికి అందజేశాడు, ఎంత మొత్తంలో తెచ్చారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

35 గ్రాముల డ్రగ్స్‌ వాడకం?

ఈ పార్టీలో మొత్తం 35 గ్రాముల కొకైన్‌ను వాడారని 8 నుంచి 10 మంది వరకు ఈ డ్రగ్‌ను సేవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారెవరన్నది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కాగా పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్‌లో 148 మంది యువతీ యువకులున్నారు. వీరు అభిషేక్‌ ఏర్పాటు చేసిన బర్త్‌ డే పార్టీకి వచ్చారా, లేక రెండు, మూడు పార్టీలు ఈ పబ్‌లో జరిగాయా అనే అంశంపై కూపీ లాగే పనిలో పోలీసులు పడ్డారు. ఆ148 యువతీ యువకుల మొబైల్‌ ఫోన్‌ నెంబర్లను బంజారాహిల్స్‌ పోలీసులు నమోదు చేశారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని చెప్పి పంపించివేశారు. అయితే ఈ కేసులో విచారణకు రమ్మని మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులు ఫోన్లు చేయగా సగానికి సగం మంది నెంబర్లు స్విచాఫ్‌గా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

అభిషేక్ ఫోన్‌లో కీలక సమాచారం?

బంజారాహిల్స్‌ ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పబ్‌ యజమాని ఉప్పల అభిషేక్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌లోని సమాచారంపై దృష్టి సారించారు. ఈ మొబైల్‌ ఫోన్‌లో పలువురు డ్రగ్స్‌ విక్రేతల నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. వారితో వాట్సప్‌ ఛాటింగ్‌లు, జరిపిన సంభాషణలు తేల్చే పనిలో పడ్డారు. డ్రగ్స్‌ విక్రేతలతో అభిషేక్‌ ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు సినీ, రాజకీయరంగ ప్రముఖులతో పాటు కొంతమంది సెలబ్రిటీలతో ఉన్న పరిచయాలను, వారితో జరిపిన ఫోన్‌ సంభాషణలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. పబ్‌ డ్రగ్స్‌ కేసులో ఏ2గా ఉన్న ఉప్పల అభిషేక్‌ పలువురు సెలబ్రిటీలతో పాటు సినీ తారలతో ఉన్న ఫోటోలు ఆయన చరవాణిలో బయటపడ్డాయి. అభిషేక్‌ వీరికేమైనా మాదక ద్రవ్యాలను సరఫరా చేశాడా లేక వారిని తన పబ్‌కు పిలిపించి వీటిని ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు జరపాలని పోలీసులు భావిస్తున్నారు. హై ప్రొఫైల్‌ ఉన్న వ్యక్తులతో అభిషేక్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆయన కాల్‌డేటా, వాట్సప్‌ ఛాటింగ్‌ల బట్టి పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

- Advertisement -

కస్టడీకి తీసుకుంటే కీలకాంశాలు వెలుగులోకి

చంచల్‌గూడ జైలులో ఉన్న అభిషేక్‌ను తమ రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తే పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై కీలక సమాచారం, అంశాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పబ్‌ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రాడిసన్‌ బ్లూ హోటల్‌ యాజమాన్యంతో అభిషేక్‌కు ఉన్న పరిచయాలు, వారితో జరిపిన ఆర్థిక లావాదేవీలు ఇతరత్రా అంశాలను తెలుసుకోవచ్చన్న భావనతో పోలీసులు ఉన్నారు. అభిషేక్‌తో పాటు పబ్‌ మేనేజర్‌ అనిల్‌ కుమార్‌ కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో బంజారాహిల్స్‌ పోలీసులు పిటీషన్‌ వేశారు. మంగ ళవారం సెలవు దినం కావడంతో బుధవారం ఈ పిటీషన్‌పై విచారణ జరిగే అవకాశముందని వారం రోజులపాటు విచారణకు కోర్టు అను మతిస్తే డ్రగ్స్‌పై మరింత కీలక సమాచారం రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement