Sunday, April 28, 2024

Water Flows: ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న గోదారమ్మ.. ఎగువ నుండి భారీగా వ‌ర‌ద నీరు రాక‌!

రెంజల్, (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదార‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. నిజామాదా జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి తరలివస్తున్న వరద నీటితో కందకుర్తి వద్ద జలకళ‌ సంతరించుకుంది. గోదావరి నదికి ఎగువన ఉన్న‌ మహారాష్ట్ర ప్రాంతాల్లో అధిక వ‌ర్షాలు కురుస్తుండడతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు త‌ర‌లివ‌స్తోంది. దీనికి తోడు ఈనెల 1వ తేదీన జల వనరుల శాఖాధికారులు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం కూడా గోదావరి నదిలో ఇన్​ఫ్లో పెరగడానికి కారణమైంది. దీంతో త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఇక.. హరిద్ర, మంజీరా, గోదావరి నదులపై భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు గంగమ్మ తల్లి ఉరకలెత్తి ప్రవహిస్తోంది.

గోదావరిలో నీటి ఉధృతి కారణంగా నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయం నీటమునిగిన దృశ్యం : ఫొటో: జక్కల సంతోష్​, రెంజల్​, ప్రభ న్యూస్​

నిన్న మొన్నటి దాకా ఇసుకతో నిండికుని ఎడారిగా దర్శనమిచ్చిన గోదావరిలో ప్రస్తుతం నీటిమట్టం పెరిగింది. నది ఒడ్డున గల పురాతనపు శివాలయం పూర్తిగా నీట మునిగింది. ఆలయ శిఖరాన్ని ఆనుకుని నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ వరద నీరు గోదావరి నది పరివాహక ప్రాంతాల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరనుంది. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే కనుక గోదావరి నదిలోకి పెద్ద ఎత్తున వరదనీరు వ‌చ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక‌ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే.. గోదావరి నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున త‌ర‌లి వస్తుండడంతో నదీతీరంలో సందడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement