Monday, May 6, 2024

ఢిల్లీకి చేరుకున్న ఐదో విమానం.. ఇంటికి బయల్దేరిన తెలుగు విద్యార్థులు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న భారతీయులను అక్కడి నుంచి స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. బుకారెస్ట్‌ నుంచి 249 మంది భారతీయులతో ఐదో విమానం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో 16 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ఐదుగురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు హైదరాబాద్​, తిరుపతికి బయల్దేరి వెళ్లారు.

కాగా, ఆదివారం తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుండి ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (రాజకీయ) వికాస్ రాజ్ సహా ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రజాప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయంలో విద్యార్థులను స్వాగతం పలికారు. ఉక్రెయిన్ నుండి విద్యార్థులను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉచిత విమాన టిక్కెట్లతో సహా అన్ని సౌకర్యాలను కల్పించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement