Friday, May 3, 2024

తెలుగు అకాడమీ బకాయిలు వడ్డీతో స‌హా చెల్లించాలి.. తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తెలుగు అకాడమీ ఆస్తుల పంపకం విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లితో కూడిన ధర్మాసనం, తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన బకాయిలను వారంలోగా చెల్లించాలని ఆదేశించగా, ఇప్పటికే రూ. 92.94 కోట్లు చెల్లించినట్టు తెలంగాణ రాష్ట్రం తెలిపింది. దీంతో మిగిలిన మొత్తం రూ. 33 కోట్లకు 6 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల రోజుల సమయమిచ్చింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి తెలుగు అకాడమీ విభజన విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలుగు అకాడమీ నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడంతో విషయం న్యాయస్థానాల చెంతకు చేరింది. ఈ క్రమంలో తెలుగు అకాడమీ విభజన పూర్తి చేయాలని గతేడాది తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు అధికారులు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. మొత్తానికి శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పుతో వివాదానికి తెరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement