Tuesday, April 30, 2024

Telangana BJP – బండి సంజ‌య్ జంబో టీమ్ …ఇక ఎన్నిక‌ల‌కు సై…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అసెంబ్లి ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఒక్కో అస్త్ర శస్త్రాన్ని సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లి ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా జంబో టీంను ఏర్పాటు చేసుకుంది. ఈ భారీ టీంతో సీఎం కేసీఆర్‌ను రానున్న అసెంబ్లి, సార్వత్రిక ఎన్నికల్లో ఢీకొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్ణయించారు. తాజాగా రాష్ట్ర కార్యవర్గంలో మరో 125 మందికి చోటు కల్పించింది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంలో 80మంది సభ్యులు కొనసాగుతుండగా అదనంగా 125మందిని చేర్చుకుని పునర్‌వ్యవస్తీకరించడంతో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సంఖ్య 205కు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితరులు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు.

పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రచారానికి చెక్‌…
తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దూకుడు పెంచారు. ఒక రకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ప్రచారానికి చెక్‌పెట్టారు. అసెంబ్లి ఎన్నికలు ముగిసేంత వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తానే ఉంటానని రాష్ట్ర కార్యవర్గ విస్తరణ ద్వారా పరోక్షంగా స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమిత్‌ షా రాకకు రెండు రోజుల ముందే రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించడం ద్వారా తనకు అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయని తనతో విభేదిస్తోన్న నేతలకు బండి సంకేతాలు పంపినట్లయింది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న వారందరినీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడంతో నేతలను తన నియంత్రణ లోకి తెచ్చుకున్నారు.

పలువురు నేతల అసంతృప్తి…
తాజా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తరణపై ఒకరిద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి నేతలమైన తమను కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడంపై అసంతృప్తితో ఉన్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమించడమేంటని తుల ఉమ ప్రశ్నిస్తున్నారు. తాను కరీంనగర్‌ మాజీ జడ్పీ ఛైర్మన్‌ను అని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన తనను రాష్ట్ర్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించడం ఉద్యమకారులను అవమానించడమేనని జిట్టా బాలకృష్ణారెడ్డి పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించడం సరికాదని గూడూరు నారాయణరెడ్డి అన్నారు.

అన్నివర్గాలకూ సమ ప్రాధాన్యం…
తాజాగా పునర్‌వ్యవస్థీకరించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తరణలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించారు. కమిటీలో తమకు చోటు ఇవ్వలేదని ఇన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోకి కీలక నేతలు తుల ఉమ, దరువు ఎల్లన్న, మురళీ యాదవ్‌, బొమ్మ శ్రీరామ్‌, రవి యాదవ్‌, తల్లోజు ఆచారి, శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, వీకే మహేష్‌, జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, అశ్వత్థామరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఉప్పల శారద తదితరులకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement