Friday, May 3, 2024

చుక్క‌ల భూముల ల‌బ్ధిదారుకు చుక్క‌లు చూపెడుతున్న త‌హాశీల్దారులు …

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి ఆ భూములను తిరిగి రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పదే పదే సమీక్షల్లో రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తున్నారు. ఆ దిశ గానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో శరవేగంగా చుక్కల భూములకు విముక్తి కల్పిస్తున్నారు. ఇదే సందర్భంలో సంబంధిత రైతులకు ప్రయోజనం కూడా చేకూర్చుతున్నారు. అయితే ఇదే ముసుగులో కొంత మంది రెవెన్యూ అధికారులు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు ప్రభుత్వ లక్ష్యాన్ని పక్క దారి పట్టిస్తున్నారు. చుక్కల భూముల సమస్యల పరిష్కారం పేరుతో తమకు అనుకూలమైన వారికి క్లీన్‌ చిట్‌ ఇస్తూ నిజమైన లబ్దిదారులకు మొండిచేయి చూపుతున్నారు. ఇదే క్రమంలో కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులకు సమస్యను పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులకు అనుకూలమైన కొంత మంది రంగంలోకి దిగి ఆ భూములను తక్కువ రేటుకు వారి నుండి కొనుగోలుచేస్తున్నారు. ఆతరువాత స్థానిక అధికారులతో కుమ్మక్కై ఆ భూములను నిషేధిత జాబితా నుండి విముక్తి కల్పించి సొంత భూములుగా మార్చేసుకుంటున్నారు. ఈప్రక్రియలో నిజమైన రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుండగా అధికారుల ఆశీస్సులున్న భూ మాఫియా మాత్రం తక్కువ ధరలకే భూములను సొంతం చేసుకుని ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఇదే వ్యవహారం నడుస్తుంది. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఓ రైతు తనకున్న 2.5 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని గడచిన ఐదేళ్లుగా స్థానిక అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతి గ్రీవెన్స్‌లోనూ అర్జీ సమర్సిస్తూనే ఉన్నారు. స్థానికంగా సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లాస్థాయిలోనూ ఆతరువాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులను కలిసి తన గోడు వెల్లబుచ్చుకున్నారు. అయితే ఆ జాబితాలో ఎకరానే చూపిస్తుందని రాష్ట్రస్థాయి అధికారులు సెలవిచ్చారు. దీంతో అంతవరకైనా తనకు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కడప జిల్లా రాజంపేటకు చెందిన మరో రైతు తనకున్న 7.5 ఎకరా పొలాన్ని గతంలో అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. వాస్తవానికి దశాబ్దాలుగా ఆపొలాన్ని రైతు కుటుంబం సాగుచేసుకుని జీవనం సాగిస్తుంది. అందుకు సంబంధించి ప్రతి ఏటా శిస్తు కూడా చెల్లిస్తున్నారు. అయితే, ఆ భూములను నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని చెప్పిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆపట్టాను రద్దుచేసి మరొకరి పేరుమీదకు మార్చారు. దీంతో ఆలస్యంగా విషయం తెలుసుకున్న రైతు లబో దిబో మంటూ తమ భూమిని తనకు ఇప్పించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించేవారు కనుచూపు మేర కనిపించడం లేదు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సంఘటనలు అన్ని ప్రాంతాల్లోనూ నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి.

ఓ వైపు విముక్తి .. మరోవైపు దందా
సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చుక్కలు భూముల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. తాజాగా గురువారం నెల్లూరు జిల్లాలో కూడా సుమారు 48 వేల ఎకరాల చుక్కల భూములకు సంబంధించి 18 వేల మంది రైతులకు విముక్తి కల్పించారు. ఇదే తరహాలో వివిధ జిల్లాల్లో కూడా చుక్కల భూముల నుండి రైతులకు శరవేగంగా న్యాయం జరుగుతుంది. అయితే ఇదే సందర్భంలో మరికొన్ని ప్రాంతాల్లో మండల స్థాయి అధికారులు ఇస్తున్న తప్పుడు నివేదికలనే జిల్లా స్థాయి అధికారులు కూడా అనుసరిస్తూ కొంత మంది నిజమైన రైతులకు అన్యాయం చేస్తున్నారు. మండల స్థాయిలో ఆర్‌ఐ, తహశీల్దార్‌ వంటి అధికారులకు అడిగినంత ముట్టచెప్తే ఏ సమస్యా లేకుండా చుక్కల సమస్యను పరిష్కరించే దిశగా నివేదికలు తయారుచేసి జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు. ఈ ప్రక్రియలో వారు చేతులు తడపకపోతే మాత్రం ముప్పు తిప్పలు పెట్టి మళ్లి చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుం రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం చూపిన చుక్కల భూముల్లో 40 శాతంపైగా కాసులతోనే సమస్య పరిష్కారమైన భూములు కాగా మరో 20 శాతం గతంలో అధికారులు ఓ పథకం ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తిరిగి వారి వద్ద నుండి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని విముక్తి కల్పించినట్లుగా షో చేస్తున్నారు.

చుక్కల భూముల పరిష్కారం కోసం .. తప్పని నిరీక్షణ
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో సుమారు 24 లక్షల ఎకరాలకుపైగా చుక్కల భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఇదే అంకెను అధికారులు కూడా అంచనా వేశారు. వాటిలో 17.7 లక్షల ఎకరాలను ప్రభుత్వం కొంత మందికి అసైన్‌ చేసింది. మరో 1.80 లక్షల ఎకరాలను రైతులు సాగుచేసుకుంటన్నట్లుగా గుర్తించారు. అయితే ఆ భూములపై తమకు పూర్తిస్థాయిలో హక్కు కావాలని గత కొంతకాలంగా సాగుచేస్తున్న రైతులు డిమాండ్‌ చేస్తూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ భూ సంస్కరణల్లో భాగంగా రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లోని 22ఏ(1)లో నిషేధిత ఆస్తుల జాబితా నుండి చుక్కల భూములను తొలగించాలని 2017లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసమయంలో అమలుచేయడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చుక్కల భూముల సమస్యపై సీ ఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ అధికారులకు అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం పైగా చుక్కల భూములకు సంబంధించిన అంశాలే ఉండటంతో సీఎం జగన్‌ వాటిపై ఫోకస్‌ పెంచారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలివ్వడంతోపాటు నెలలో రెండు సార్లు ఇదే అంశంపై సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. చాలా జిల్లాల్లో చుక్కల సమస్య పరిష్కారం అవుతుంది. ఇదే ముసుగులో కొంత మంది అధికారులు అందిన వరకు బొక్కేస్తూ నిజమైన రైతులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటివరకూ నిషేధిత జాబితా నుండి తొలగించిన భూములకు సంబంధించి పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే పరిష్కారానికి నోచుకోని భూములకు సంబంధించి కూడా 40 శాతం వరకూ క్లియర్‌గా ఉన్నప్పటికీ అధికారులు పథకం ప్రకారం రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement