Tuesday, April 30, 2024

వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌కు సింధు దూరం… భావోద్వేగానికి గురైన స్టార్ ష‌ట్ల‌ర్‌

కామ‌న్వెల్త్ గేమ్స్‌లో దేశానికి ప‌సిడి ప‌త‌కాన్ని తెచ్చిన‌ తెలుగు తేజం స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు సోష‌ల్ మీడియా వేదిక‌గా శ‌నివారం రాత్రి ఓ భావోద్వేగ‌భ‌రిత ప్ర‌క‌ట‌న‌ను పోస్ట్ చేసింది. కామ‌న్వెల్త్‌లో బంగారు ప‌త‌కాన్ని సాధించిన తాను బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌న‌కు దూర‌మ‌య్యాన‌ని తెలిపింది. కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భాగంగా త‌న కాలికి గాయ‌మైంద‌ని, దాని కార‌ణంగానే తాను వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌న‌కు హాజ‌రు కాలేక‌పోతున్నాన‌ని తెలిపింది.

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భాగంగా క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో త‌న కాలికి గాయ‌మైంద‌ని… అయితే గెలుపే ల‌క్ష్యంగా సాగిన తాను కామ‌న్వెల్త్ నుంచి వైదొల‌గేందుకు సిద్ధ‌ప‌డ‌లేద‌ని సింధు తెలిపింది. ఈ క్ర‌మంలో త‌న కోచ్‌, ఫిజియో, ట్రైన‌ర్‌ల సాయంతో ఎంత దాకా వీల‌యితే అంత‌దాకా పోరాడాల‌నే నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో సెమీస్‌తో పాటు ఫైన‌ల్స్‌లోనూ గాయం కార‌ణంగా భ‌రించ‌లేని నొప్పిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాన‌ని పేర్కొంది. ఆ శ్ర‌మ త‌న‌కు బంగారు ప‌త‌కాన్ని సాధించి పెట్టింద‌ని తెలిపింది.

కామ‌న్వెల్త్ గేమ్స్ ముగియ‌గానే… హైద‌రాబాద్‌కు చేరుకున్న మ‌రుక్ష‌ణ‌మే ఆసుప‌త్రికి వెళ్లి ఎంఆర్ఐ చేయించుకున్నాన‌ని సింధు తెలిపింది. ఎడ‌మ పాదంలో చీలిక ఏర్ప‌డిన‌ట్టు వైద్యులు తేల్చార‌ని ఆమె పేర్కొంది. ఈ క్ర‌మంలో కొన్ని వారాల పాటు విశ్రాంతి త‌ప్ప‌నిస‌రి అని వైద్యులు సూచించార‌ని తెలిపింది. ఈ కార‌ణంగానే తాను వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌న‌కు హాజ‌రు కాలేక‌పోతున్నాన‌ని పేర్కొంది. త్వ‌ర‌లోనే శిక్ష‌ణ మొద‌లుపెడ‌తాన‌ని ఆమె పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement