Tuesday, April 30, 2024

Breaking : రుచిరా కాంబోజ్ అరుదైన ఘ‌న‌త‌-ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌త‌దేశ తొలి మ‌హిళా రాయ‌బారిగా బాధ్య‌త‌లు

అరుదైన ఘ‌న‌త‌ని సొంతం చేసుకున్నారు రుచిరా కాంబోజ్. ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌త‌దేశ రాయ‌బారిగా తొలి మ‌హిళ‌గా ఆమె నిలిచారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు తన ఆధారాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. భద్రతా మండలిలోని నా అంబాసిడర్ స్నేహితులందరినీ ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త హోదాలో నా దేశానికి సేవ చేయడం నాకు గొప్ప గౌరవ‌మ‌ని రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. బాధ్యతలను స్వీకరిస్తోన్న ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేశారు. ఇక రుచిరా కాంబోజ్‌కు ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న టీఎస్ తిరుమూర్తు అభినందనలు తెలియజేశారు.మన దేశం నుంచి ఈ రికార్డును సాధించిన మొదటి మహిళ రుచిరా కాంబోజ్ కావడం మరో విశేషం.

రుచిరా కాంబోజ్ (58) 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. గతంలో భూటాన్‌‌లో భారత రాయబారిగా ఉన్నారు. జూన్‌లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. రుచిరా 2002-2005 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గా కూడా పనిచేశారు. రుచిరా కాంబోజ్ 1987 సివిల్ సర్వీస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. 1989-1991 వరకు ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో మూడో కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత విదేశాంగ శాఖ కింద పని చేశారు. అనంతరం మారిషస్, దక్షిణాఫ్రికా, భూటాన్ సహా మరికొన్ని దేశాల్లో కూడా తన సేవలను అందించారు.ఈ సందర్భంగా ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా పనిచేసిన లక్ష్మీరాయ్.. రుచిరా కాంబోజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంబోజ్ నియామకాన్ని UNలో మహిళల నాయకత్వానికి కొత్త మైలు రాయిగా అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement