Saturday, April 27, 2024

ఓపెన్ …. లాక‌ర్స్..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి ‍ ‍- పారదర్శకత పేరిట బ్యాంకులు ఖాతాదార్ల వ్యక్తిగత గోప్యత హక్కును హరిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసేది. గ్రామీణుల్లో పొదుపును ప్రోత్సహించడంతోపాటు వారి ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలబడేందుకు గ్రామాల్లో బ్యాంకుల శాఖల్ని తెరిచేది. వెయ్యికి పైగా గడపున్న ప్రతి గ్రామంలో ఏదొక బ్యాంక్‌కు చెందిన శాఖ ఉండాలని గతంలో ప్రభుత్వం సంకల్పించింది. సహజంగానే దీంతో ప్రజలకు, బ్యాంకులకు మధ్య సంబంధాలు పెరిగాయి. బ్యాంకుల పట్ల గ్రామీణుల్లో కూడా విశ్వాసం వృద్ధి చెందింది. అయితే తదనంతర కాలంలో రిజర్వ్‌బ్యాంక్‌ ఆదేశాల పేరిట బ్యాంకులు తమ వ్యయాన్ని అదుపు చేసుకోవడం మొదలె ట్టాయి. నగదు ఉపసంహరణకు ఏటీఎమ్‌లను అందుబాటు లోకి తెచ్చాయి.

ఈ విధానంలో ఖాతాదార్లకు 24గంటలూ సెలవులతో సంబంధం లేకుండా నగదు ఉపసంహరణకు అవ కాశాలు కల్పించాయి. అయితే రాన్రాను ఏటీఎమ్‌ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను తొలగించాయి. సెక్యూరిటీ గార్డుల్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో ఇప్పుడు ఏటీఎమ్‌ల్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ సాకు చూపి పగటిపూట మాత్రమే ఏటీఎమ్‌ల్లో బ్యాంకర్లు నగదును అందుబాటులో పెడుతున్నారు. నగదు ఉపసంహరణ కోసం ఖాతాదార్లు పలు ఏటీఎమ్‌ల చుట్టూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే తరచూ ఏటీఎమ్‌లు మరమ్మతులకు గురౌతున్నాయి. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడంలేదు. తాజాగా రిజర్వ్‌బ్యాంక్‌ మరికొన్ని ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఖాతాదార్ల గోప్యత హక్కుకు ఇబ్బంది ఏర్పడింది. ఇంట్లోని నగలు, ఇతర విలువైన వస్తువుల్ని భద్రత కోసం బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపర్చడం ఖాతాదార్లకు అలవాటుగా మారింది. ఈ లాకర్‌ కేటాయింపులకు బ్యాంకులు సవాలక్ష నిబంధనలెట్టాయి. కనీస స్థాయిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అదే బ్యాంక్‌ శాఖలో ఉండాలి. అలాగే నెలకు లాకర్‌ సైజ్‌ను బట్టి ఐదు వేల నుంచి పదివేల వరకు చెల్లించాల్సిన అద్దెకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆ మేరకు వడ్డీ వచ్చే విధంగా మరికొంత నగదును బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయాలి. ఇలాగే ఇంతకాలం ఖాతాదార్లు తమ లాకర్లను నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ లాకర్లలో భద్రపర్చిన పత్రాలు, నగలు లేదా ఏ ఇతర వస్తువులు చోరీకి గురైనా బ్యాంకులకు ఏమాత్రం సంబంధంలేదు. అంతేకాదు.. లాకర్లలో భద్రపర్చే ముందే సంబంధిత వివరాల్ని నాన్‌జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై నమోదు చేయాలి. దీన్ని నోటరీ చేయించాలి. దీని అసలు కాపీని సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌కు అందించాలి. దాని నకలును మేనేజర్‌ నుంచి స్వీకరించి భద్రపర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న వస్తువుల్ని మాత్రమే లాకర్లో భద్రపర్చుకోవాలి. ఈ విధానం వల్ల లాకర్లలో ఉంచే ప్రతి వస్తువు లేదా పత్రాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ముందస్తుగానే అధికారులకు వెల్లడించాల్సి వస్తుంది. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా నియమ నిబంధనల మేరకు మహిళలు తమ పుట్టింటి నుంచి తెచ్చుకునే ఆభరణాలు లేదా సంసారంలో రూపాయి రూపాయి మదుపు చేసి కొనుగోలు చేసిన బంగారు వస్తువులను ఇకముందు లాకర్లలో భద్రపర్చే వీల్లేదు. వాటి వివరాలు, కొనుగోలుకు సంబంధించిన బిల్లుల్ని ముందుగా మేనేజర్లకు సమర్పిస్తేనే వాటికి లాకర్లలో స్థానం లభిస్తుంది. రిజర్వ్‌బ్యాంక్‌ తాజా ఉత్తర్వులతో గోప్యతాహక్కు హరించుకుపోగా ఆదాయ పన్ను, ఇతర నిఘా సంస్థలకు ఖాతాదార్ల వ్యక్తిగత ఆభరణాలు, విలువైన వస్తువులు, పత్రాలన్నింటి వివరాలు చేరతాయి. వాటికనుగుణంగా ఆదాయ పన్ను శాఖ పన్నులు విధిస్తుంది. మరింతగా ఆదాయాన్ని సముపార్జిస్తుంది. ప్రభుత్వం తన ఖాజానాను మరింతగా నింపుకునేందుకు వీలైన మార్గాన్ని ఇప్పుడు రిజర్వ్‌బ్యాంక్‌ ఈ విధంగా అమలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో వినియోగదార్లపై అదనపు భారం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement