Sunday, May 5, 2024

Spl Story: విమానాల సిస్టమ్​పై రాన్​సమ్​వేర్​ అటాక్,​ టేకాఫ్​లో వైఫల్యం.. ప్రయాణికుల నరకయాతన

స్పైస్​జెట్​ విమానాల సిస్టమ్స్​పై రాన్​సమ్​వేర్​ అనే మాల్​వేర్​ అటాక్​ అయ్యింది. దీంతో పలు విమానాలు టేకాఫ్​ కావడంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే ప్రయాణికులు బోర్డింగ్​ చెకప్​ క్లియరెన్స్​ అయ్యి.. విమానంలో కూర్చొన్న తర్వాత ఈ గందరగోళం తలెత్తింది.. దీంతో నాలుగైదు గంటలపాటు విమానంలోనే ప్రయాణికులు వెయిట్​ చేయాల్సి వచ్చింది. ఇవ్వాల ఉదయం జరిగిన ఈ ఆందోళనకర పరిస్థితిని చాలామంది తమ ట్విట్టర్​ ద్వారా విమానయాన శాఖ, స్పైస్​జెట్​ యాజమాన్యానికి తెలియజేశారు. దీనిపై స్పైస్​జెట్​ వివరణ కూడా ఇచ్చుకుంది. అయితే.. ఫుడ్​ లేకుండా గంటలకొద్దీ విమానంలో కూర్చోవడం ఎంత నరకమో మీకు తెలుసా అంటూ  ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ఇవ్వాల గందరగోళం తలెత్తింది. ఓ స్పైస్​జెట్​ విమానంలోని సిస్టమ్స్​పై రాన్​సమ్​వేర్​ మాల్​వేర్​తో అటాక్​ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఓ ప్రయాణికుడు తన ట్విట్టర్​లో ఈవిషయం పోస్టు చేయడంతో అది కాస్త బయటి ప్రపంచానికి తెలిసి ప్రయణికుల్లో ఆందోళన కలిగించింది. స్పైస్​జెట్​ ప్రయాణికుడు ముదిత్​ షెజ్వర్​ తాను టేకాఫ్​ కావడంలో ఫెయిల్యూర్​ అయిన విమానంలో ఉన్నానని ఆ ట్వీట్​లో పేర్కొన్నాడు. బోర్డింగ్​ ఫార్మాలిటీస్​ పూర్తయిన 80 నిమిషాల తర్వాత కూడా టేకాఫ్​ కాలేదని తెలిపాడు.

‘‘ ధర్మశాలకు వెళ్లాల్సిన SG2345 విమానంలో మేము ఎక్కి ఇప్పటికే 80 నిమిషాలైంది. మేము ఇంకా టేకాఫ్ చేయలేదు. కొందరు సాఫ్ట్​వేర్​ ప్రాబ్లమ్​ అని చెబుతున్నారు. సర్వర్ డౌన్ అయిందంటున్నారు. ఇంకొందరేమో ఇంధనం కోసం ఆగిందని అంటున్నారు. కానీ రాన్​సమ్​వేర్​ అటాక్​ చేయడం వల్లే ఫ్లైట్​ ఆగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది నిజమేనా” అని అతను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్​ను స్పైస్‌జెట్​తో పాటు  పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అథారిటీని ట్యాగ్ చేయడంతో కలకలం రేగింది.

రెండు గంటల తర్వాత షెజ్వార్ ట్వీట్​కు స్పైస్​ జెట్​ రిప్లయ్​ ఇచ్చింది. మునుపటి రోజు రాత్రి ransomware దాడి కారణంగా బుధవారం ఉదయం నుంచి విమానాలు టేకాఫ్​ కావడం లేదు అని స్పైస్‌జెట్ తెలిపింది.

“హాయ్ ముదిత్.. కొన్ని స్పైస్‌జెట్ సిస్టమ్‌లు గత రాత్రి ransomware దాడిని ఎదుర్కొన్నాయని దయచేసి గమనించండి. అది పలు విమానాల టేకాఫ్​పై ప్రభావం చూపింది. ఈ రోజు ఉదయం బయలుదేరే విమానాల వేగాన్ని తగ్గించింది. మా ఐటీ బృందం పరిస్థితిని సరిదిద్దింది. ఇప్పుడు విమానాలు సాధారణంగా నడుస్తున్నాయి. ” అని ఎయిర్‌లైన్ థ్రెడ్‌పై సమాధానం ఇచ్చింది.

- Advertisement -

అయితే.. ప్రయాణికులందరూ ఫుడ్​ లేకుండా దాదాపు 4 గంటల పాటు విమానంలో ఇరుక్కుపోయారని తెలుస్తోంది. అయితే మరో ట్వీట్​లో “విమానాలు సాధారణంగా పనిచేస్తాయా?? మేము 3 గంటల 45 నిమిషాల నుండి ఇక్కడ చిక్కుకున్నాము. అయితే విమానాలను రద్దు చేయడం కానీ, ఆపరేట్ చేయడం కానీ చేయడం లేదు. విమానంలో కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు బ్రేక్ ఫాస్ట్ కూడా లేదు. దీనికి స్పైస్​జెట్​ సిబ్బంది నుంచి నో రెస్పాన్స్” అని షెజ్వార్ బదులిచ్చాడు.

ఇలాంటి ఫిర్యాదులతో బుధవారం మొత్తం స్పైస్‌జెట్ ట్విట్టర్​ హోరెత్తిపోయింది. మరో ప్రయాణికుడు.. ఇషా అగర్వాల్ ఇలా ట్వీట్ చేశారు “మీరు మీ కస్టమర్‌లకు విమాన సమయాల గురించి సరైన సమాచారం ఇవ్వకుండా, ఇలాగే సేవ చేస్తున్నారా. నాకు ఈరోజు ఉదయం 8:45 గంటలకు శ్రీనగర్ నుండి ఢిల్లీకి (SG 475) విమానం ఉంది. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లోని బోర్డుని తనిఖీ చేసినప్పుడు.. విమానం సరైన సమయానికి వెళ్లినట్లు ఫ్లైట్ స్థితి చూపుతోంది. కానీ, నేను ఎవరికి కమ్యూనికేట్ చేయాలి.. 9:00 A.Mకి మీ అధికారి ఒకరి నుండి విమానం ఢిల్లీలో నిలిచిపోయిందని, ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని నాకు తెలిసింది. అని ట్విట్టర్​లో పోస్టు చేశారు.  

అట్లాగే జైపూర్, కాన్పూర్ విమానాశ్రయాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే కనిపించాయి. ఇక్కడ ప్రయాణికులు విమానాల కోసం దాదాపు ఐదారు గంటల పాటు ఆహారం లేకుండా వేచి ఉండవలసి వచ్చింది. ప్రయాణికులు, స్పైస్‌జెట్ సిబ్బంది మధ్య వాగ్వాదం కూడా జరిగింది.  స్పైస్‌జెట్ కస్టమర్ కేర్ నంబర్‌లుకూడా  ఏవీ పనిచేయడం లేదని ప్రయాణికులు చాలామంది ట్విట్టర్‌లో కంప్లెయింట్స్​ చేయడం ప్రారంభించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement