Monday, April 29, 2024

Railway | పూరి ఎక్స్​ప్రెస్​కు తప్పిన పెనుముప్పు.. కప్లింగ్​లు విరిగి, విడిపోయిన రెండు కోచ్​లు

హౌరా-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు కోచ్‌లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే కప్లింగ్​లు విరిగిపోవడంతో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. దీంతో ఇంజిన్ ముందుకు కదులుతూ ఉండగానే దాని నుంచి రెండు కోచ్​లు విడిపోయాయి. కదులుతున్న రైలు నుండి కోచ్‌లు డిస్‌కనెక్ట్ అయిన వెంటనే, అవి బలమైన కుదుపు, పెద్ద శబ్దంతో ఆగిపోయాయి. దీంతో రైలులోని ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కప్లింగ్ విడిపోవడం వల్ల ఎలాంటి గాయాలు జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రైలు హౌరా నుండి పూరీకి బయలుదేరింది. ఇవ్వాల (ఆదివారం) తెల్లవారుజామున 1.30 గంటలకు వెస్ట్ మిడ్నాపూర్‌లోని నేకుర్సేని స్టేషన్ దగ్గర రైలులో లోపం కనుగొన్నారు. కదులుతున్న రైలులో కప్లింగ్ విరిగిపోవడంతో రైలులోని రెండు కోచ్‌లు దెబ్బతిన్నాయి. రైల్వే స్టేషన్‌లోకి రైలు రావడానికి ముందే కొంత దూరంలో ఆగింది. పెద్ద శబ్దం కావడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్క ఉదుటన లేచారు.

ఇంజిన్ నుండి రెండు కోచ్‌లు విడిపోయిన వెంటనే ప్రయాణికులలో భయాందోళనల నెలకొంది. ఏమైందనోననే ఆందోళనతో చాలా మంది పట్టాలపైకి వచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. కాగా, ఖరగ్‌పూర్ డివిజన్‌కు చెందిన రైల్వే అధికారులు, ఇంజినీర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు కప్లింగ్‌ను సరిచేశారు. దీని ఫలితంగా స్వల్ప ప్రమాదంతో ప్రయాణికులు బయటపడ్డారు. కాగా, వారు కప్లింగ్​లను సరిచేయడానికి చేసే ప్రయత్నంలో చాలా సేపు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యింది. వాటిని సరిచేయడంలో చాలాసేపు విఫలమయ్యారు. దీంతో నెకుర్సేని రైల్వే స్టేషన్‌కు రెండు వేరే రైల్వే కోచ్‌లను పంపించారు.

మిగిలిన ప్రయాణికులను కొత్త కోచ్‌లలో తరలించారు. ఆ తర్వాత రైలు ఉదయం 8 గంటల ప్రాంతంలో పూరీకి బయలుదేరింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య చౌదరి మాట్లాడుతూ.. ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటలకు హౌరా-పూరీ ఎక్స్ ప్రెస్‌లో జరిగిందన్నారు. కప్లింగ్ ఎలా విరిగిపోయిందనే దానిపై విచారణ జరుపుతున్నాం. దీన్ని తొలుత రైలు సెక్యూరిటీ గార్డు చూశాడు. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. విరిగిన కప్లింగ్‌లతో కోచ్‌లను రిపేర్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో ఖరగ్‌పూర్ నుండి కొత్త కోచ్‌లను తెప్పించాం. జనరల్‌, స్లీపర్‌ కోచ్‌ మధ్య సెక్షన్‌లో ఈ ఘటన జరిగిందని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement