Thursday, May 2, 2024

Exclusive Interview – మోదీ అంటే..గ్యారెంటీ! – అధికారం అంటేనే ప్ర‌జా సేవ‌

ప్ర‌జ‌ల ఆలోచ‌నల్లో మార్పు వ‌చ్చింది
ప్ర‌ధాని పీఠంపై కూర్చొని ఎంజాయ్ చేయ‌డం లేదు
ప్ర‌జ‌ల విశ్వాసంతో విజ‌యం సాధించాం
సిద్ధాంతాల‌ను, క‌ల‌ల‌ను అమ‌లు చేశాం
సెంటిమెంట్ల‌తోనే అప్ప‌ట్లో కాంగ్రెస్ గెలిచింది
యావ‌త్ దేశం వారి వెంటే న‌డిచింది
ప్ర‌జ‌లు కోరుకున్న‌ది వారు చేయ‌లేదు
సాధార‌ణ ప్ర‌జ‌ల కంటే ఎక్కువ స‌మ‌యం ప‌నిచేస్తున్నా
సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్.. సబ్‌కా ప్రయాస్ నినాదం
దేశ ప్రజల వద్దకు ఆత్మ విశ్వాసం, గ్యారెంటీల‌తో వెళ్తున్నాం
సుస్థిర ప్ర‌భుత్వం ఏం చేసిందో అంతా చూస్తున్నారు
ప్ర‌పంచ దేశాల‌న్నీ భార‌త్‌ను ఎంతో గౌర‌విస్తున్నాయి
పాల‌సీలు, విధానాలే మా ప్ర‌భుత్వానికి ప్రాణవాయువు
ఓ మీడియా సంస్థ‌తో ప్ర‌ధాని మోదీ ఇంట‌ర్వ్యూ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, స్పెష‌ల్ డెస్క్‌: భార‌త దేశం ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొంది. ఇంత‌కుముందు ఉన్న ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల సెంటిమెంట్‌తో ఆడుకున్నాయి. ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆశ‌యాల‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ప్ర‌పంచం ముందు భార‌త దేశం చిన్న‌చూపున‌కు గుర‌య్యింది. అయితే.. నేను దేశ ప‌రిస్థితుల‌ను, ప్ర‌పంచ పోక‌డ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశాను. అప్ప‌ట్లో నాకు అవ‌కాశం మాత్ర‌మే ఇచ్చారు. ఆ త‌ర్వాత దేశ ప‌రిస్థితుల తీరును స‌మూలంగా మార్చేశాను. ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆశ‌యాల‌ను నెర‌వేర్చేలా సుస్థిర ప్ర‌భుత్వం ఏర్పాటు చేశాం. ప‌దేండ్లుగా కేంద్రంలోని ప్ర‌భుత్వం ప్ర‌జా జీవ‌న విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. అవినీతి ర‌హిత పాల‌న అనేది మాకు ఎంతో కీల‌కం. అయితే.. ద‌ర్యాప్తు సంస్థ‌ల ప‌నితీరు బాగుంటే.. తామేదో చేసిన‌ట్టు కొంత‌మంది ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వాటి ప‌ని అవి చేసుకుంటూ పోతే ప్ర‌శ్నించ‌డం ఎందుకు?.. ప‌నిచేయ‌కుంటే బాధ‌ప‌డాలి కానీ, ప‌నిచేస్తుంటే ఎందుకు బాధ‌ప‌డాలి అని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

- Advertisement -

ప్రశ్న: మీరు రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి విజయం కోసం భారత వృద్ది గురించి మాట్లాడున్నారు. ఈ దేశ వృద్ది, మీ విజయం మధ్య కాంబినేషన్ ఏమిటి?

జవాబు: చూడండి… మొదటి విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని పొందాలనే ఆకాంక్ష ప్రతి రాజకీయ పార్టీకి వుంటుంది. ప్రజల విశ్వాసంతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతాలను, కలలను అమలు చేసేందుకు ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నా. ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి ఆశయం లేకపోతే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక రోజు అధికారంలోకి వచ్చి తమ ఆలోచనల ఆధారంగా దేశానికి సేవ చేస్తామనే భావన కలిగి ఉండాలి. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. బీజేపీ విషయానికొస్తే.. 2014కు ముందు కాంగ్రెస్‌కు 5-6 దశాబ్దాలు పాలించే అవకాశం వచ్చింది. ఆనాడు వారికి ప్రతిపక్షం లేదు. ఇప్పటిలాగ మీడియా కూడా అంతగా లేదు. ఉన్నా ఇంత ఎఫెక్టివ్​గా పనిచేసేది కాదు. అంటే ఓ రకంగా వారు ఏం చేసినా ఎదురు చెప్పేవారు లేరు. దేశం కూడా వారి వెంటే ఉండేది. స్వాతంత్య్రోద్యమం తర్వాత సెంటిమెంట్లు ఉన్నందున యావత్ దేశం వారు కోరుకున్నది చేయగలిగింది. కానీ, వారు ఆ అవకాశాన్ని కోల్పోయారు. క్రమంగా పరిస్థితులు మరింత దిగజారాయి. అలాంటి పరిస్థితుల్లో 2013లో నాకు భారతదేశం గురించి ఏం తెలుసో, ప్రపంచం గురించి ఏం తెలుసో ప్రజలకు చెప్పాను.

ప్ర‌జ‌ల ఆలోచ‌న్ల‌లో మార్పు వ‌చ్చింది..

దేశం సమస్యాత్మక పరిస్థితుల్లో ఉన్నపుడు ప్రజలు నన్ను నమ్మారు… సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. 2014 సంవత్సరంలో ఆశలు చిగురించాయి. ప్రజల హృదయాల్లోనే కాదు నా ఆలోచనల్లోనూ ప్రజల అంచనాలను నెరవేరుస్తామనే ఆశ ఉంది. వచ్చే ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడపడం అంటే.. నేను పాలించను, ప్రజాసేవ చేస్తానంతే. నా దృష్టిలో ప్రభుత్వాన్ని నడపడం అంటే పాలించడమని అర్థం కాదు. సేవచేయడం. నేను ప్రధాని పీఠంపై కూర్చుని ఎంజాయ్ చేయాలనుకునే రకం కాదు. నేను ప్రజల కోసం సాధారణ పౌరుడికంటే కష్టపడి పనిచేస్తా. మా పనితీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. 2014లో ఆశాజనక వాతావరణం ఉంటే, 2019లో అది విశ్వాసంగా మారింది. సామాన్య ప్రజలు చూపించే నమ్మకం నాలో కొత్త విశ్వాసాన్ని నింపింది. మేము సరైన దిశలోనే ఉన్నామని అనుకున్నాను. దేశంలో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రాన్ని అమలు చేయగలిగాం. 2019లో ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్లాము. కానీ, 2024లో దేశ ప్రజల వద్దకు సంపూర్ణ విశ్వాసంతో వెళుతున్నాం.

సుస్థిర ప్ర‌భుత్వాన్ని సుసాధ్యం చేశాం..

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13-14 ఏళ్ల అనుభవం, 10 ఏళ్ల ప్రధానిగా అనుభవంతో చెబుతున్నా … నా పనితీరును బట్టి చెబుతున్నా… ఈసారి ప్రజలవద్దకు గ్యారంటీలతో వెళుతున్నాం. అంటే మొదట ఆశ, తర్వాత నమ్మకం, ఇప్పుడు హామీ. ఒక హామీ ఇచ్చామంటే అది మనపై పెద్ద బాధ్యతను పెడుతోంది. ప్రపంచానికి ఈరోజు భారత్‌పై నమ్మకం ఏర్పడిందని నేను భావిస్తున్నా. 30 ఏళ్లుగా భారత్‌లో అస్థిర ప్రభుత్వాలను ప్రపంచం చూసింది. అస్థిర ప్రభుత్వాల వల్ల దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ప్రపంచం ముందు భారత్‌కు విలువ లేకుండా పోయింది. అయితే సుస్థిర ప్రభుత్వం ఏం చేయగలదో దేశ ఓటర్లు చూశారు. అందుకే మోదీ 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అనుకుంటున్నారు. బీజేపీ పోటీ చేయడం లేదని అనుకుంటున్నారు.. దేశ ప్రజలే పోటీ చేస్తున్నట్లు భావిస్తున్నారు. దేశ ప్రజలు 10 ఏళ్ల అనుభవంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉంది.

ప్రశ్న : ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సెంటిమెంట్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు ?

జవాబు: నేను చాలా కాలంగా ప్రజా జీవితంలో పని చేస్తున్నాను. నేను ‘సంఘటన్’ కార్యకర్తగా కూడా పనిచేసాను. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థంచేసుకోగలను. నేను జ్యోతిష్కుడిని కాదు.. కానీ ఎక్కడికి వెళ్లినా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోగలను. దాన్ని బట్టి మాట్లాడగలను. ఎన్నికల సమయంలో మాత్రమే పర్యటనలు చేసే వ్యక్తిని కాదు. సాధారణంగా వారానికోసారి ప్రయాణిస్తా. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం ఏదో ఒక ప్రదేశానికి వెళ్తా. అధికారిక పనులు కూడా ప్రజల మధ్యనే చేస్తున్నా. కాబట్టి నేను మారుతున్న పరిస్థితులను అంచనా వేయగలుగుతున్నా. ఇప్పుడు కనిపిస్తున్న వన్ సైడ్ వాతావరణం ఎన్నికలు ప్రకటించిన తర్వాత సృష్టించబడలేదని నమ్ముతున్నా. ప్రజల అపూర్వ మద్దతుతో పాటే గత 10 సంవత్సరాలుగా ఇది పెరుగుతూ వస్తోంది.

దేశాన్ని ఎవ‌రి చేతిలో పెడుతున్నా అని ఆలోచిస్తున్నారు..

మీరు సాధారణ ఓటరు అయితే ఓటు వేసేటప్పుడు ఏమనుకుంటారు? నేను దేశాన్ని ఎవరికి ఇస్తున్నాను? అని ముందుగా మీరు ఆలోచించండి. అప్పుడు మీరు చూసే వ్యక్తులను పోలుస్తారు. అప్పుడు అనుకుంటారు మేము దేశానికి మంచి చేసిన ట్రాక్ రికార్డ్ వున్నవారి చేతుల్లో పెట్టాలని. చెప్పింది చేసి చూపించేవారిని ఎన్నుకుంటారు. ఇలాగే ఓ ఆలోచన ఏర్పడుతుంది. రెండోది మా మిత్రపక్షాలు ఎవరు, మా ఆలోచన ఏమిటి, మా ఎజెండా ఏమిటో మీరు చూస్తారు. ఇదే క్రమంలో ఇతరుల పనులు, అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా చూస్తారు. ఈ ఎన్నికల్లో ఒక మంచి విషయం ఏమిటంటే 2014లో ఓటర్లు పోల్చడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పుడు చాలా కోపం వచ్చింది. కానీ ఈసారి (గత ప్రభుత్వం) చేసేదానితో పోల్చారు… మోదీ ఇది చేస్తున్నారు, వాళ్లు ఈ తప్పు చేశారు, కానీ మోదీ చేయలేదు. వాళ్లు తప్పు చేసేవారు, మోదీ చేయరు. ఇలా ఇలా పోల్చడం ద్వారా ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే వారి కళ్లలో ప్రేమ, ఆకర్షణతో పాటు ‘మిమ్మల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాం మోదీజీ! మీరు ప్రశాంతంగా ఉండండి, చింతించకండి’ అనే బాధ్యత కనిపిస్తోంది.

ప్ర): మీ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ఉంది. రాజకీయ కారణాలతో కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది అంటున్నారు. దీని గురించి ఏం చెబుతారు?

జవాబు : మీరు దీన్ని గమనించినందుకు నేను కృతజ్ఞుడను. నేను ఆర్థికంగా బలమైన రాష్ట్రానికి చెందినవాడిని. 13 సంవత్సరాలు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపాను. ఇక గత 10 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నా. ప్రజలు నా జీవితాన్ని చూస్తున్నారు. నా సహచరులు కూడా నా జీవితాన్ని చూస్తున్నారు. వారు నా పద్దతులు చూశారు. నేను ఇలాంటి విషయాలకు విలువ ఇస్తే ఎవరూ అడుగు కూడా బయటపెట్టలేరు. రెండో విషయం ఏమిటంటే.. మొదటినుంచి నా ప్రభుత్వాన్ని పాలసీలే నడిపించాలని కోరుకుంటాను. కొన్నిసార్లు విధానాల రూపకల్పనలో తప్పులు జరుగుతుంటాయి. వాటిని గుర్తించి విమర్శించే హక్కు ప్రజలకు ఉంటుంది. పాలసీతో తప్పొప్పులు ఉన్నపుడు అధికారులు కూడా చూస్తాం, చేస్తాం అనే పరిస్థితి ఉండదు. వివక్షకు అవకాశం ఉండదు. ఇక పౌరులు కూడా అది తన హక్కు అయితే దక్కుతుంది.. లేదంటే దక్కదని భావిస్తారు. కాబట్టి పాలసీలపై నమ్మకం పెరుగుతుంది.

ఉద్యోగ నియామ‌కంలో మార్పులు చేశాం

మేము కూడా కొన్ని అడుగులు వేయడం మీరు చూసారు. గతంలో 3, 4వ స్థాయి ఉద్యోగుల నియామకానికి ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూ కేవలం 30 సెకన్లలో ముగిసిపోయేది. అభ్యర్ధి మంచివాడా, చెడ్డవాడా అని కేవలం 30 సెకన్లలో నిర్ణయించగల తెలివైన వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. కాబట్టి ఇంటర్వ్యూ విధానం తీసివేయాలని చెప్పాను. అన్ని అర్హతలు గలవారు తమ బయోడేటా ఆధారంగా దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగాలకు ఎవరు అర్హులో, ఎవరు కాదో కంప్యూటర్ నిర్ణయిస్తుంది. కంప్యూటర్ ఫలితాల్లో వచ్చిన మొదటి 200 మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను అందజేయండని చెప్పాను. అయితే అనుకున్నట్లుగా కాకుండా ఏ ఇద్దరో, ఏ నలుగురో బలహీనమైన వారు ఎంపిక కావచ్చు.. కానీ పాదర్శకంగా నియామకం జరిగింది కాబట్టే తనకు అవకాశం వచ్చిందని భావిస్తాడు. తన స్కిల్స్ పెంచుకుని బాగా పని చేయడానికి ప్రయత్నిస్తాడు.

టెక్నాల‌జీతో వేగ‌వంత‌మైన పాల‌న‌..

ఇప్పుడు ఆదాయపు పన్ను మదింపు ఉంది. చాలా ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ అవినీతికి అవకాశం ఉంది. కాబట్టి మేము దాన్ని సాంకేతికతతో అనుసంధానించాము. ఈ రోజు ముంబైలో ఫైల్ అయిన ఆదాయపన్ను గౌహతి, చెన్నై, కొచ్చి ఎక్కడైనా వుండొచ్చు.ఈ విషయం ఎవరికీ తెలియదు. అందువల్ల ఎలాంటి అవినీతికి తావులేకుండా పనులు జరుగుతాయి.. దీంతో ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. కాబట్టి మేము డిజిటల్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం. మేము పనుల్లో మానవ జోక్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మనకు GeM పోర్టల్ ఉంది. మీరు GeM పోర్టల్‌కి రండి… ప్రభుత్వం ఏ కొనుగోలు చేసినా GeM పోర్టల్ లో ఉంటుంది. ఈ పోర్టల్ తో వేగంగా, నాణ్యతతో కూడిన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మేము కలిగి ఉన్న ఆన్‌లైన్ మెకానిజం, సౌకర్యవంతమైన కార్యాచరణ అన్ని విషయాల మంచి ఫలితం ఇస్తుందని నమ్ముతున్నాను.

క‌రోనా సంక్షోభంలో అండ‌గా ఉన్నాం..

మేము 1 రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుకుంటాయి అని కొందరు ప్రధానులు అన్నారు. అలా మధ్యమధ్యలో ఎవరో ఒకరు ప్రజాధనం తింటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. మేము 1 రూపాయి పంపితే 100 పైసలు ప్రజలకు అందుతాయి. కాబట్టి సామాన్య పౌరుడు కూడా తనకు దక్కాల్సింది సంపూర్ణంగా దక్కిందని భావిస్తాడు. కరోనా సంక్షోభ సమయంలో కూడా దేశం పూర్తిగా ప్రభుత్వానికి అండగా వుంది… ప్రజలు దేశం పెద్ద సంక్షోభం ఉందని నమ్మారు… మనలాంటి వారు కష్టపడి పనిచేస్తే దేశానికి మేలు జరుగుతుందని భావించారు.

ప్ర) ఈడీ, సీబీఐ దుర్వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి మీరేమంటారు?

జవాబు: నేను ఆశ్చర్యపోయాను. రైల్వేలో టికెట్ కలెక్టర్ పనిని ఉదాహరణ తీసుకుందాం. అతను టిక్కెట్లను ఎందుకు తనిఖీ చేస్తాడు? మనం నిజాయితీ లేనివాళ్లమా? అని కూడా కొందరు అడగవచ్చు. కానీ టిక్కెట్లను తనిఖీ చేసే బాధ్యత టికెట్ కలెక్టర్ దే. అదేవిధంగా ఈడీ లేదా సీబీఐ సృష్టించబడ్డాయి… వారి బాధ్యతలు వారికి ఉన్నాయి. ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఆపకూడదు. వారి పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. వారు స్వతంత్రంగా పనిచేసేందుకు అనుమతించాలి. టికెట్ కలెక్టర్ ను అనుమతించినట్లే, వారిని కూడా అనుమతించాలి. రెండోది ఈడీ అవినీతికి వ్యతిరేకంగా అనేక రకాల కేసులు నమోదు చేసింది.. అది ప్రభుత్వ అధికారులైనా లేదా డ్రగ్ మాఫియా అయినా. ఈడీ కేసుల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే రాజకీయాలతో ముడిపడి ఉన్నారు. మిగతా 97% శాతం తమ పనిలో నిజాయితీగా వ్యవహరించకపోవడంతోనే పట్టుబడ్డారు. ఇలా చాలామంది అధికారులు ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటికి వెళ్లిపోతే మరికొందరు జైలుకు వెళ్లారు. దీని గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు.

అవినీతిని నిర్మూలించేందుకు ఆ సంస్థ‌ల ఏర్పాటు..

దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు గత ప్రభుత్వాలే పలు సంస్థలను ఏర్పాటుచేసాయి. మేము కాదు. అయినా.. పని చేయకపోతే ప్రశ్నించాలి కాని పని చేస్తున్నారని ప్రశ్నించడం ఏమిటి. ఇది లాజికల్ గా అనిపించడంలేదు. 2014కి ముందు ఈడీ (పిఎమ్‌ఎల్‌ఎ) 1800 కంటే తక్కువ కేసులను నమోదు చేసింది. ఆ సమయంలో ప్రభుత్వమే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేది. కానీ 2014 తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్లలో ఈడీ 5000కు పైగా కేసులు పెట్టింది. ఇది దాని సామర్థ్యాన్ని, పనితీరును తెలియజేస్తుంది. 2014కి ముందు కేవలం 84 సోదాలు నిర్వహించారు. అంటే అంత పెద్ద డిపార్ట్‌మెంట్ నిద్రపోతోంది.

స్వ‌తంత్రంగానే ఉండాల‌ని చెప్పాం..

2014 నుండి 7000 సోదాలు జరిగాయి. 2014కు ముందు సుమారు రూ.5000 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. 2014 తర్వాత రూ.1.25 లక్షల కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. ఇది దేశ ఆస్తి. ఇప్పుడు చెప్పండి ఈడీ ట్రాక్ రికార్డ్ మనకు ఏమి చెబుతుంది? ఈడీకి ట్రాక్ రికార్డు దాని సామర్థ్యం, స్వతంత్రంగానే ఎంత పెద్ద స్థాయిలో పనిచేస్తుందో తెలియజేస్తుంది. మనం దేశం నుండి అవినీతిని తొలగించాలనుకుంటే అందుకోసం ఏర్పాటుచేసిన సంస్థలను స్వతంత్రంగా పని చేయడానికి మనం అనుమతించాలి. రాజకీయ నాయకులు ఇలాంటి సంస్థల్లో వేలు పెట్టకూడదు. అందుకే నేను ప్రధానమంత్రి అయినప్పటికీ ఈడీ పనిని అడ్డుకునే హక్కు నాకు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement