Sunday, April 28, 2024

తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు రీ ఓపెన్ కానున్నాయి. అయితే కరోనా కేసులు పూర్తిగా తగ్గకపోయినా స్కూళ్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ వారంలో వాదనలు వినే అవకాశం ఉంది. మరోవైపు సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

స్కూళ్లు, కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభం అయిన తర్వాత ఏదైనా పాఠశాలలో 5 కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైతే వెంటనే ఆ స్కూల్‌ను తాత్కాలికంగా మూసేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి టెస్టు చేయించాలని చెప్పారు. ఎక్కువ మందికి కరోనా వస్తే ఆ స్కూల్‌లోని స్టూడెంట్లు, సిబ్బందికి కరోనా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు చేయించాలన్నారు. ఎక్కువ కేసులు నమోదైన స్కూలు, హాస్టల్‌కు సంబంధించిన వివరాలను కలెక్టర్‌తో పాటు స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌కు పంపించాలన్నారు.

మరోవైపు స్కూళ్లు, హాస్టళ్లలోని రూమ్‌లు, బెంచీలు, కిటికీలు, టాయిలెట్లు, టాప్స్, వాటర్ ట్యాంకులను స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడి క్లీన్ చేయించాలని డీఈవోలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఆదేశించారు. వీటి పర్యవేక్షణపై ఈ నెల 30 వరకు రోజూ రిపోర్టు పంపించాలన్నారు. నీటి కనెక్షన్ లేని స్కూళ్లలో మిషన్ భగీరథ ద్వారా కనెక్షన్ ఇప్పించాలని, కరెంట్ లేనిచోట కనెక్షన్ ఇప్పించాలని చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement