Wednesday, May 15, 2024

నేటి నుంచి పార్లమెంట్‌.. బడ్జెట్‌ మలివిడత సమావేశాలు

మలివిడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్‌సభ కొలువుదీరనున్నాయి. పార్లమెంట్‌ సెషన్‌ రెండవ భాగంలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. అదే విధంగా పెరుగుతున్న నిరుద్యోగం, ఈపీఎఫ్‌ వడ్డీరేట్లు తగ్గింపు, ఉక్రెయిన్‌ అంశం, భారతీయుల తరలింపు వంటి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. జమ్ము-కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం కోసం బడ్జెట్‌ ప్రతిపాదనలు, బడ్జెట్‌సమర్పణకు పార్లమెంట్‌ ఆమోదం వంటివి కేంద్ర ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు లోక్‌సభలో జమ్ము-కాశ్మీర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భోజన విరామం తర్వాత ఈ అంశాన్ని సభలో చర్చకు తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగ (షెడ్యూల్జ్‌ తెగలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదం కోసం తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఉభయసభలు ఏకకాలంలో భేటీ..
పార్లమెంట్‌ ప్రారంభ సమయంలో పాటించిన విధంగానే కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ అనుసరించి ఉభయసభలు జరగనున్నాయి. ఇప్పుడు కొవిడ్‌ చాలా వరకు అదుపులోకి వచ్చినందున, మొదటి సెషన్‌లో నిర్వహించిన వేర్వేరు షిఫ్ట్‌లకు బదులుగా, లోక్‌సభ, రాజ్యసభ రెండు ఉదయం 11 గంటల నుంచి ఏకకాలంలో సమావేశం కానున్నాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు చాంబర్లు, సందర్శకుల గ్యాలరీలను ఉపయోగించడం ద్వారా సభ్యుల సీటింగ్‌ ఏర్పాట్లలో భౌతికదూర నిబంధనలు కొనసాగుతాయి. సీట్ల అమరిక ప్రకారం రాజ్యసభలో 237 మంది సభ్యులకు ఏర్పాట్లు చేశారు. వీరిలో 139 మంది చాంబర్‌లో కూర్చుంటారు. 98 మంది గ్యాలరీలలో ఆసీనులవుతారు. అదేవిధంగా లోక్‌సభలో 538 మందికి సీటింగ్‌ అమరిక ఉండగా, ప్రధాని సహా 282 మంది చాంబర్‌లోనూ, 258 మంది గ్యాలరీలోనూ కూర్చోవచ్చు. ప్రెస్‌ గ్యాలరీలో మీడియాను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేయబడుతుంది. మంత్రులు, ఎంపీల సిబ్బందిని కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతించడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement