Friday, May 3, 2024

రూ.60కోట్ల‌తో ‘పాపాఘ్ని’ న‌దిపై కొత్త వంతెన‌

ఈ ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం స‌మీపంలోని పాపాఘ్ని న‌దిపై వంతెన కుంగిపోయింది. దాంతో ఆ వంతెన‌పై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులు సమీపంలోని రైలు వంతెన మీద నుంచి నడిచి వెళ్లాల్సివచ్చింది. అది ప్రమాదకరమని గుర్తించిన ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. కూలిన పాపాఘ్ని వంతెనకు ఓ వైపున పలకలు వేసి పాదచారులు రాకపోకలు సాగించేందుకు అవకాశం కల్పించింది.

శాశ్వత చర్యలు సూచించేందుకు చెన్నై ఐఐటీకి చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులు బి.నాగేశ్వరరావు, బాలసుబ్రమణియమ్‌లను రప్పించింది. వారిద్దరూ కుంగిన వంతెనను పరిశీలించారు. పాపాఘ్నిపై పాత వంతెనకు సమాంతరంగా కొత్త వంతెన నిర్మించాలని సూచించారు. దీంతో ఆర్‌ అండ్‌ బి శాఖ ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు పంపించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. దాదాపు రూ.60 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వంతెన నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్లు పిలిచి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement