Wednesday, May 1, 2024

అడవి తల్లి ఒడిలో..దండారి సంబరం..

గుస్సాడి నృత్యాలతో మారుమోగుతున్న గూడాలు..
పద్మల్‌పురి కాకో ఆలయానికి భక్తజన తాకిడి..
అడవి బిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం దండారి..
తెలుగురాష్ట్రాలు, మహారాష్ట్ర‌, చత్తీస్‌గఢ్‌, ఒడిస్సా ప్రాంతాల నుంచి ఆదివాసుల రాక..

ఉమ్మడి ఆదిలాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : అడవి ఒడిలో దండారి సంబరం మొదలైంది. గోండ్‌ గూడాలు గుస్సాడి నృత్యాలతో మారుమోగుతున్నాయి. వాయిద్యాల చప్పుళ్లతో గల్లు గల్లుమనే గజ్జల రవళుల మధ్య సాగుతున్న నృత్యగానాలు కోలాహలంతో గోండు గూడాలు సందడిగా మారాయి. దండారి సంబరాలు అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సవాలు నింపుతున్నాయి. గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్‌ పద్మల్‌పురి కాకో ఆలయానికి భక్తజన తాకిడి ఎక్కువైంది. దండెపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్‌ పురి కాకో ఆలయానికి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా మ‌హారాష్ట్ర , చత్తీస్‌గఢ్‌, ఒడిస్సా ప్రాంతాల నుంచి ఆదివాసులు వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఆదివాసీ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా జరుపుకునే దండారి పండుగ అత్యంత ప్రాధాన్యమైంది. దండారి సంబురాలు దీపావళి రోజుతో ముగుస్తాయి. దండారి పండుగ ఆదివాసుల్లో ఐక్యతను మరింత బలోపేతం చేస్తుంది. దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి వారితో కలిసి ఆటా పాట వినోదాల్లో పాలుపంచుకుంటాయి. గత నాలుగైదు రోజుల నుంచి అడవి ఒడిలో సంబరాలు జరుగుతున్నాయి. ఆదివాసీ సంస్కృతిలో ఆటపాటలకున్న ప్రాధాన్యతను.. దండారి నృత్యాల సందర్భంగా గోండుల విశిష్ట జీవన శైలి కళ్లకు కట్టినట్లు చెపుతుంది. గోండు గూడాల్లో ఏ చిన్న పండుగైన పబ్బమైన అందులో ఆటపాటలకే పెద్దపీట వేస్తారు. నాగరిక వినోదాలు, పద్ధతులు ఇంకా ఒంటబట్టని మారుమూల ప్రాంతాల గోండులు తమ ఆటపాటల్లోనే తమ జీవితానికి అవసరమైన ఆనందాన్ని వెతుక్కుంటారు. ఏడాది పొడవున ఏదో ఒక పండుగ జరుపుకోవడం పరిపాటైన గోండులకు దీపావళి పండుగ సందర్భంగా జరుపుకునే దండారి పండుగ ఆదివాసీ సంస్కృతిలో విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుని ఉంది.

దండారి ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం కూడ ఈ ఏడాది గ్రామానికి పదివేల రూపాయల చొప్పున కోటి రూపాయలు ఆర్థికసహాయాన్ని అందజేసింది. దండారి సంబరాల సందర్బంగా గ్రామాలకు గ్రామాలే ఆటపాటల్లో మునిగిపోతాయి. ఎంత అవసరమైన పని ఉన్న వాయిదా వేసుకుని దండారి సంబరాల్లో పాల్గొనే ఆనవాయితీ ఉంది. డప్పు, డోలు వాయిద్యాల చప్పుళ్లతో కోలాహలంగా నృత్యగానాలు పరిపాటి అయిపోయాయి. ఆదివాసులు తమ సంస్కృతి ,సంప్రదాయాలను ఇప్పటికి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. దానికి నిదర్శనం దండారి సంబరాలే. ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల నుంచి పుట్టిన దండారిని జరుపుకోవడం కోసం, గోండులు ఆశాడ మాసంలోనే అకాడిపేన్‌ అనే దేవతకు పూజలు జరుపుతారు. ఆషాడ‌ మాసం పౌర్ణమి రోజున ఈ పూజ జరుపకపోతే దసరా తర్వాత జరిపి ఉత్సవాలను ప్రారంభిస్తారు. దండారిలో ఆట పాటలకు ఉపయోగించే డప్పు, రడమేళా, డోల్‌, వెట్టి , కర్ర ,పెప్రి, తుడుం తదితర సంగీత పరికరాలను నెమలి ఈకలతో పేర్చిన గుస్సాడి కిరీటీలను ముఖానికి ధరించే పువ్వుల‌ను గ్రామం మధ్యన గుట్టపైన పేర్చి,సంప్రదాయ రీతిలోపూజలు జరిపి, మేకలు, కోళ్లను బలివ్వడం ఆచారం. దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాతనే నృత్యాలు ప్రారంభిస్తారు.

పూర్తిగా పురుషులు పాల్గొనే ఈ నృత్య గానాల్లో గుస్సాడి ,చచ్చాయి, చాహోయి ప్రధాన నృత్య రూపాలుగా ఉంటాయి. వీటిని వేరు వేరుగా ప్రదర్శిస్తారు. గుస్సాడి అలంకరణ విచిత్రంగా ఉంటుంది. గుడ్డ లేద నెక్కర్‌ మాత్రమే ధరించి గుస్సాడి నృత్య కళాకారులు శరీరంనిండా బూడిదని పూసుకుంటారు. ముఖానికి మసి రాసుకుంటారు. ఎడమ భుజంపై మేక చర్మం లేక జింక చర్మాన్ని వేలాడదీసుకుంటారు. కుడిచేతిలో మంత్ర దండం లాంటి రోకలి ఉంటుంది. గుస్సాడి నృత్యం చేసే వారిని దేవతలు ఆవహిస్తారని, అతను అతని రోకలితో శరీరాన్ని తాకితే ఎలాంటి రోగాలైన నయమవుతాయని ఆదివాసులు నమ్ముతారు. మెడలో రుద్రాక్షలు తదితర అడవిలో దొరికే కాయలతోను, గువ్వలతోని పేర్చిన దండలు వేలాడుతుంటాయి. తలపై నెమలి ఈకలతో కూర్చిన కిరీటాన్ని ధరిస్తారు. ఇందులో చిన్న చిన్న అద్దాలు , మేక లేక జింక కొమ్ములు అమరుస్తారు. నడుముకు , కాళ్లకు గజ్జలు కడుతారు. జంతువుల కదలికలను స్మృరిస్తూ లయబద్దంగా సాగే గుస్సాడి నృత్యానికి వాయిద్యాల చప్పుడు తప్ప పాట నేపథ్యం ఉండదు.

- Advertisement -

డప్పులు, భజాలు, తుడుం మొదలైన వాయిద్యాలు సృష్టించే శబ్దానికి గజ్జల రవళి తోడై సంగీతాన్ని సమకూరుస్తుంటే దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ.. దండాన్ని ఊపుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. గూడెమంతా ప్రతిధ్వనించే వాయిద్యాల శబ్దానికి అనుగుణంగా లయబద్దంగా, విచిత్రంగా సాగే గుస్సాడి నృత్యం చూపరులను సంబ్రమాన్ని కలిగిస్తుంది. ఒక గ్రామంలోని దండారి బృందం సభ్యులు మరో పక్క గ్రామానికి అతిధులుగా తరలివెళ్లి ఆటను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది అతిథ్యమిచ్చిన గ్రామంలోని బృందం మరుసటి ఏడాది అతిథ్యం స్వీకరించిన గ్రామానికి తరలి వెళుతుంది. వారు ఏ రీతిలో మర్యాదలు పాటించి అతిథ్యం ఇచ్చారో అదేస్థాయిలో అతిథ్యం పొందుతారు.

ఈపద్దతిలో ప్రతీ గోండు గూడెం కనీసం రెండు మూడు గూడాలతో దండారి సంబంధాన్ని కొనసాగిస్తుంది. ముందుగానే సమాచారం పంపి అతిధులుగా తరలివెళ్లిన దండారి బృందం గూడెం శివారులకు సాయంత్రం సమయానికి చేరుకుని సంకేతంగా డప్పు మోగిస్తారు. డప్పు శబ్దం వినగానే అతిధ్యం ఇచ్చే గ్రామంలోని దండారి బృందంతో సహా చిన్నపెద్ద కలిసివెళ్లి అతిధి బృందానికి వాయిద్యాల చప్పుళ్ల మధ్య ఘనంగా స్వాగతం పలికి తీసుకు వస్తారు. రాత్రంతా దండారి బృందం ఆటపాటలతో వింది వినోదాలు పంచుకుంటాయి. ఈ ఆచారం వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుంది. పాశ్చత్య సంస్కృతి నీడలు ఇప్పుడిప్పుడే గిరిజన ప్రాంతాల్లోకి అడుగు పెడుతున్నప్పటికి ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు కల్తీ లేకుండా కొనసాగుతుండ‌టం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement