Saturday, May 4, 2024

ORR tenders : లిక్కర్ స్కాం కంటే చాలా పెద్దది ఓఆర్ఆర్ స్కాం : రేవంత్ రెడ్డి

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కంటే ఓఆర్ఆర్ స్కాం చాలా పెద్ద‌ద‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కనీస ధర ప్రకటించకుండా టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధమని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టీఓటీ టెండర్లు కూడా ఈ కోవలోకే వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ అనుసరించి ఏ టెండరు పిలవాలన్నా 2031 లోపు వుండేలానే పిలవాలని, కానీ ఓఆర్ఆర్ టెండరును 30 సంవత్సరాలకు కట్టబెట్టారని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా 15, 20 ఏళ్లకు టెండర్లు పిలుస్తుంటారని, కానీ తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల లీజుకు రాసిచ్చేసిందని, తద్వారా ఓఆర్ఆర్ ను అమ్మేస్తోందని విమర్శించారు. ఈ టెండరు ఒప్పందాలపై ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వనంత మాత్రాన కాంగ్రెస్ వద్ద వివరాలు లేవనుకుని అర్వింద్ కుమార్, సుధీర్ కుమార్, వివేకానంద… కేటీఆర్ తరఫున బుకాయిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓఆర్ఆర్ కు సంబంధించిన ఒప్పంద పత్రం మొత్తం తన వద్ద ఉందని వెల్లడించారు.

2023 ఏప్రిల్ 27న ఒప్పందం చేసుకున్నారని, టెండర్లు ఆమోదించి ఇవాళ్టికి 30 రోజులు పూర్తయినందున, రూ.7,300 కోట్లలో 25 శాతం అంటే రూ.1800 కోట్లు ప్రభుత్వానికి ఐఆర్ బీ డెవలపర్స్ చెల్లించాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. కానీ, ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించారన్నది స్పష్టంగా తెలుస్తోందని, పైగా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం టెండరు నిబంధనలు మార్చి ఉంటే ఆ విషయం చెప్పాలని నిలదీశారు. ఇది కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం వంటిదేనా అనే సందేహాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మొదట చాలా కఠిన నిబంధనలతో రూపొందించారని, కానీ కల్వకుంట్ల కవిత, ఇతర సౌత్ నాయకులు రంగప్రవేశం చేసిన ఆ తర్వాత ఆ లిక్కర్ పాలసీలో మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సీఎం కేజ్రీవాల్ కు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారని వివరించారు. కిషన్ రెడ్డి ఓసారి ప్రెస్ మీట్ పెట్టి రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారని, కానీ ఓ కుటుంబం ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడితే, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ ఎందుకు లేఖలు రాయడం లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement