Tuesday, May 7, 2024

Weather | తెలంగాణ‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. మూడు రోజులపాటు వడగళ్ల వానలు

తెలంగాణ‌లో రాగల మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన‌ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌, కొన్ని జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో వడగళ్లవాన కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి వడగళ్ల వానలు కురుస్తాయని అధికారులు వెల్ల‌డించారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు.

హీట్‌వేవ్స్‌ నుంచి ఉపశమనం..
మరో వైపు భారత వాతావరణ శాఖ కూడా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాగల ఆరు రోజులు చాలా ప్రాంతాల్లో హీట్‌వేవ్‌ పరిస్థితుల నుంచి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు హేట్‌వేవ్‌ పరిస్థితులు ఉండబోవని, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులుంటాయ‌ని వెల్ల‌డించారు. వెస్ట్రన్‌ డిస్టబెన్స్‌ ఈశాన్య రాజస్థాన్‌, సెంట్రల్‌ మధ్యప్రదేశ్‌, తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

సాధారణంగా హీట్‌వేవ్‌ పరిస్థితులు మార్చి నుంచి జూన్‌ వరకు ఉంటాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం జులై వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 26, 27న కేరళలో, 27న తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయలో 28న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ (ఐఎండీ) పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement