Wednesday, May 1, 2024

Radia tapes: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో నీరా రాడియాకు క్లీన్​ చీట్​.. ఆమె తప్పేమీ లేదన్న సీబీఐ

ఫోన్​ ట్యాపింగ్ కేసులో కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. మాజీ కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాపై రాజకీయ నాయకులు, లాయర్లు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తల మధ్య జరిగిన సంభాషణల టేపులను పరిశీలించడంలో అభ్యంతరకరం ఏమీ లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు ఇవ్వాల (బుధవారం) తెలిపింది. కార్పొరేట్ సంస్థల మధ్య మధ్యవర్తిత్వం నెర‌ప‌డ‌మే వృత్తిగా సాగిన నీరా రాడియా టేపుల వ్యవహారంపై ఇవ్వాల సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2009లో కేంద్ర కేబినెట్‌లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపుకు సంబంధించి నీరా రాడియా కీల‌కంగా వ్యవహరించారన్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా బుధవారం విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ట్యాప్‌ చేసిన 8వేల సంభాషణలకు సంబంధించిన కేసుల్లో కీలక నిందితురాలిగా భావిస్తున్న నీరా రాడియాకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. టేపుల వ్యవహారంలో నమోదైన 14 కేసుల్లో ప్రాథమిక విచారణ జరిగిందని, ఇందులో నీరా రాడియా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆధారాలు దొరకలేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ అఫిడ‌విట్‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు విచార‌ణ‌ను వ‌చ్చే వారానికి వాయిదా వేసింది.

కాగా, నీరా రాడియా వర్సెస్‌ రతన్‌ టాటా కేసును జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తోంది. కార్పొరేట్‌ లాబీయిస్ట్ నీరా రాడియా, టాటా గ్రూప్ బాస్‌ల మధ్య జరిగిన సంభాషణలు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తన గోప్యత హక్కును రక్షించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా సంభాషణలపై విచారణ జరిపి.. స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం సీబీఐని ఆదేశించింది.

సెలవుల తర్వాత దీనిపై విచారణ జరుపుతామని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే.. ఈ కేసులో సీబీఐ తాజా స్టేటస్ రిపోర్టును దాఖలు చేసే అవకాశం ఉన్నది. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement