Monday, April 29, 2024

కర్ఫ్యూ టైమ్ లో ఏపీకి వస్తున్నారా ?

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొన్నిచోట్ల లాక్‌ డౌన్ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటూ తమిళనాడు, కర్ణాటకలో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీలో కూడా రాత్రి కర్ఫ్యూ విధించారు. శనివారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. కరోనా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెస్టారెంట్లు సహా అన్నింటినీ మూసేయాలన్నారు. రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించి.. గతంలో మాదిరిగా వార్డులలో మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. దుకాణాలు, ప్రజా రవాణా, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు. కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్‌లు, మీడియా, పెట్రోల్‌ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. 

అయితే, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాత్రి సమయంలో ప్రయాణించేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో ప్రయాణికుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్‌ తో పాటూ పొరుగున ఉన్న చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే వారికి సందేహాలు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధం లేనందున కర్ఫ్యూ సమయంలోనూ ఏపీకి రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. బస్సులు, రైళ్ల ద్వారా ఏపీకి వచ్చి ఇళ్లకు వెళ్లేవారికి పోలీసులు అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన వారు తమ దగ్గరున్న టికెట్స్ చూపిస్తే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. అలాగే రాత్రి సమయంలో తమ వారిని పికప్ చేసుకునేందుకు వెళ్లేవారు సైతం.. వారి బంధువులు, స్నేహుతుల ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే అనుమతిస్తారు. వరైనా హెల్త్ ఎమర్జెన్సీతో సొంత వాహనాల్లో వస్తే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement