Tuesday, May 14, 2024

Big Story | త్వ‌రలో సరికొత్త టీమ్‌.. అసెంబ్లీ వ్యూహాలపై ఫోకస్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ కాకకు ధీటుగా అధికారుల మార్పులు, చేర్పులూ అనివార్యం కానున్నాయి. ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదలీలపై ఇప్పుడు ఆతృత నెలకొంది. జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్‌ల నుంచి మొదలుకుని ప్రభుత్వానికి అవసరమైన శాఖల్లో నమ్మకస్తులను నియమించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక మిగిలింది అంతా ఎన్నికల సమయమే కావడంతో తమ పార్టీకి క్షేత్రస్థాయినుంచి మొదలు రాజధాని వరకు ఎటువంటి రాజకీయ, ఇతరత్రా ఇబ్బందులు లేకుండా అధికారగణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది.

ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్నట్లుగా సంకేతాలొస్తున్న తరుణంలో కేసీఆర్‌ మార్క్‌ పరిపాలనా టీం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఉన్నతస్థాయి అధికారుల బదలీలకు కార్యాచరణ వేగంగా జరుగుతోంది. అసెంబ్లిdకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్కార్‌ కీలక పాలనాపరమైన నిర్ణయాలకు సిద్దమవుతోంది. ఈ నిర్ణయాలను పక్కాగా అమలు చేసే అధికారులూ అంతే అవసరమని భావిస్తోంది. ఇందుకు పాలనలో కీలకమైన అఖిల భారత స్థాయి అధికారుల్లో(ఐఏఎస్‌) మనవారెవరని ఆరా తీసి జాబితా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదలీలు చేపట్టింది. ఇప్పటికే బదలీలను పెద్ద మొత్తంలో చేసిన ప్రభుత్వం మరికొందరిని త్వరలో బదలీలు చేసి ఎన్నికల నిర్వహణను సరళం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో భారీగా బదలీలు జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు కీలక శాఖల్లో ఇన్‌చార్జీల వివరాలను రెడీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చే కీలక శాఖల్లో తమవారిని నియమించుకోవాలని భావిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు ఇదే తీరును అమలు చేయడం ఆనవాయితీ కాగా, సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా మూడోసారి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకోవాలంటే ఇది తప్పనిసరి కానున్నది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధినేతపై అధికారుల బదలీలపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. కొన్ని జిల్లాల్లో మినహా మిగతా జిల్లాలంతటా భారీగా కలెక్టర్ల మార్పుతోపాటు సీనియర్‌ ఐఏఎస్‌లకు బదలీలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 30తో పాలనా శాఖల్లో ఉద్యోగుల బదలీలకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో పక్కాగా అధికారుల బదలీలు ఖాయమని చెబుతున్నారు.

- Advertisement -

అసెంబ్లి వేదికగా ప్రచారానికి సై…
వచ్చే నెల 3నుంచి కేంద్ర నిర్లక్ష్యాలను అసెంబ్లిd వేదికగా ఎండగడుతూ, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయాలను వివరిస్తూ విజయవంతంగా సమావేశాలు ముగించుకునేందుకు రెడీ అవుతోంది.

ఆర్థిక ఆంక్షలు, కేంద్ర వైఖరిపై…
ఆగస్టు 3నుంచి జరగనున్న సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయింపుల్లో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి ఇదే అంశాన్ని, గడచిన తొమ్మిదేళ్ల కేటాయింపులు, నిధుల విడుదల లెక్కలు ప్రస్తావించి జాతీయ స్థాయిలో మైలేజీ పొందాలని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల కేంద్ర సాయాలు, గ్రాంట్లు, ఇతర వివరాలను క్రోడీకరించి నివేదిక సిద్దం చేసింది. తెలంగాణపై కేంద్రం శీతకన్ను వేసిందని ఘనాంకాలతో రుజువు చేయనుంది. ప్రధానంగా గ్రాంట్లు, పన్ను ఆదాయం, జీఎస్‌టీ చెల్లింపులు ఇతర నిధుల విషయంలో పెద్దఎత్తున కోత విధిస్తున్న తీరును సభ వేదికగా ఎండగట్టాలని చూస్తోంది. కొన్నిసార్లు బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగానే చూపినా విడుదల చేసేటప్పుడు మాత్రం విదిలించడం, ఆరకొర నిధుల విడుదలలోకూడా అంతులేని జాప్యం చేస్తోంది.

దీంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులపై దృష్టిపెట్టి, ఆదాయాన్ని పెంచుకుని సంక్షేమ పథకాలను కొనసాగిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ పురుడుపోసుకున్న తొలి ఏడాదినుంచే కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని అవలంభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఏనాడూ కేంద్రం సాయమందించలేదు. పన్నుల రూపంలో రావాల్సిన వాటాతోపాటు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో అందాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తూనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.

ప్రత్యేక కేటాయింపులేమీ లేవు…
ఇక రాష్ట్రానికి కేంద్రం తొమ్మిదేళ్లలో ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. గిరిజన వర్సిటీకి రూ. 26.90కోట్లను కేటాయించిన కేంద్రం జాతీయ సంస్థలకు మినహా పెద్దగా రాష్ట్ర ప్రయోజనాలకు కేటాయింపులేమీ చేయలేదు. ఐఐఎం, ఐఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల స్థాపన, ఎయిమ్స్‌కు నిర్దిష్టంగా నిధుల ప్రస్తావన చేయలేదు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన నివ్జ్‌ుకు రూ. 500 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనతోపాటు, ఆదిలాబాద్‌లో సీసీఐ పునరుద్ధరణ, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు రూ. 1000 కోట్లు సాయం కోరినా కేంద్రం ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. ఇక 15వ ఆర్థికసంఘం 42 శాతం వాటాను 41కి తగ్గించడంతో ఈ ప్రభావం ఈ ఏడాదినుంచి మరింత తీవ్రం కానుంది. కేంద్రంనుంచి వచ్చే పన్నుల వాటా నిధులను గత రెండు మూడేళ్లుగా ఏనాడూ ఆ స్థాయిలో చెల్లింపులు చేయలేదు.

కేంద్ర నిర్లక్ష్యం ఫలితంగానే….
కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల కారణంగా రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడుతోంది. అయినప్పటికీ ఎటువంటి ప్రతికూలతలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్న తెలంగాణ తాజా ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడిలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌ఎస్‌, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్‌ 12.9 శాతం తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈ వృద్ధి రేటును నమోదు చేయడం ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఆర్ధిక వృద్ధికి ఆటంకాలు…
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడం, అప్పుల పరిమితుల్లో కోతలు విధించడం వంటి వాటితోపాటు, కొత్త కొత్త చట్టాలతో షరతులు విధించి వాటిని అమలు చేస్తేనే అప్పుల పరిమితిని పెంచుతామని బహిరంగ బెదిరింపులకు కేంద్రం దిగుతోంది. ఇలా ఈ ఏడాదిలో ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని ఆర్ధిక వర్గాలు భావిస్తున్నాయి. గొప్పలు చెప్పుకుంటున్న మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంనుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ. 47,312 కోట్లు నిధులు మాత్రమే తెలంగాణకు అందినట్లు లెక్కలు ధృవీకరిస్తున్నాయి.

మరింతగా తగ్గుతున్న కేంద్ర సాయాలు…
గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష 84 కోట్ల నిధులను వివిధ క్యాపిటల్‌, ఇతర ఎక్స్‌పెండిచర్‌ చేయగా, సీఎస్‌ఎస్‌ పథకాల కింద కేంద్రంనుంచి అందింది రూ.5200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి రూ. 1 లక్షా 84వేల కోట్లకు పెరిగి ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచి ఆర్ధిక పురోగతిలో దూసుకుపోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement