Friday, May 3, 2024

గుడివాడలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. ఆర్ఐపై హత్యాయత్నం

కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. గుడివాడ మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రి పూట జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. తవ్వకాలను అడ్డుకున్నారనే కోపంతో ఆర్ఐపై ఇసుకాసురులు దాడికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్లితే.. మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకున్నారు. దీంతో మట్టి మాఫియా ఆయనపై దాడి చేశారు. ఆర్ఐ మొహంపై పిడిగుద్దులు కురిపించారు. ఆర్ఐని చంపేస్తామంటూ మట్టిమాఫియా హెచ్చరించింది. గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై గతంలోనే దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేసినట్లు ఆర్ఐ అరవింద్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తిరిగి ప్రారంభమైన తవ్వకాలను అడ్డుకున్న తనపై మట్టి మాఫియా దాడి చేసినట్లు పేర్కొన్నారు. తన చొక్కా పట్టుకుని.. మెడలోని చైన్ పట్టుకుని లాగారని చెప్పారు. విషయం తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్ఐపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement