Thursday, May 9, 2024

ఎవ‌రి తంత్రం వారిదేః ఎన్డీఎ విస్త‌ర‌ణ‌కు మోడీ…విప‌క్షాల ఐక్య‌తకు నితీష్..

న్యూఢిల్లి: అటు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ విపక్షాలను ఏకం చేయడం కోసం ప్రయత్నిస్తుండగా ఇటు బీజేపీ ఎన్డీయే కూటమిని కూడగట్టడంలో తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇరువురి లక్ష్యం 2024 లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం. కాంగ్రెస్‌, ఆప్‌, టీఎంసీతో పాటుగా దాదాపు 20 బీజేపీయేతర పార్టీలు జూన్‌ 23న పాట్నాలో ఒకే వేదికపై ఐక్యతను ప్రదర్శించనున్నాయి. ఇప్పటిదాకా ఒకరంటే ఒకరికి పడని విపక్షాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక బీజేపీపై జరిపే ఐక్యపోరాటానికి వేదికగా మారే ప్రాంతాలను గుర్తించడంలో ఏకాభిప్రాయ సాధనకు పాటుపడతాయి. మరోవైపు అదే జూన్‌ 23న ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దానర్థం ఇటీవల కాలంలో దేశంలో మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలను బీజేపీ ఉపేక్షిస్తుందని కాదు.

బీజేపీ వర్గాల ప్రకారం పాట్నాలో పరిణామాలపై ప్రధాని సలహాదారులు ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌నేత రాహుల్‌ గాంధీ, తదితర నేతలు ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకోవడంతో బీజేపీయేతర పక్షాలు తలోదారిగా ఇప్పటిదాకా వ్యవహరిస్తున్నాయి. పాట్నాలో విపక్షాల భేటీ ఆరంభించడానికి పూర్వమే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి నితిశ్‌ కుమార్‌ కష్టపడి చమటోడ్చి రూపొందించిన ఫార్ములా విపక్షాల్లో కొన్నింటి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఉదాహరణకు nవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లిd, పంజాబ్‌ రాష్ట్రాల్లో పోటీకి కాంగ్రెస్‌ దూరంగా ఉంటేనే ఈ ఏడాది మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆప్‌ తేల్చి చెప్పింది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి మమతా బెనర్జీ సిద్ధంగా లేరు.


ఇదంతా కూడా 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల నుంచి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని నితీశ్‌ కుమార్‌ ప్రతిపాదించినప్పుడు వెలుగులోకి వచ్చింది. ఐక్యతపై విపక్షాలు ఆడుతున్న దాగుడు మూతల్లో లబ్ది పొందేది అధికార బీజీపీయే అనేది రాజకీయ పండితుల భావన. ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణ, హిందూత్వ భావజాలానికి ఇది తోడైతే బీజేపీకి మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే బీజేపీని వ్యతిరేకించే నేతలను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలతో అరెస్టు చేయించడం ద్వారా విధిలేని పరిస్థితుల్లో విపక్షాలు ఏకం కావాల్సిన పరిస్థితిని అధికార బీజేపీ పరోక్షంగా సృష్టించింది. అదే ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టడంలో మోడీకి ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలైన మహారాష్ట్ర సీఎం ఏకనాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గం, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీతో సమస్యలను బీజేపీ ఎదుర్కొంటోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఆదేశాలకు లోబడి ఎన్డీయేను బలోపేతం చేయడంలో ఇటీవల చేపట్టిన కొన్ని చర్యలు సత్‌ ఫలితాలను ఇస్తున్నాయి.

- Advertisement -

చంద్రబాబుతో పొత్తు పొడుపులు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడంతో 2018లో ఎన్డీయే నుంచి నిష్క్రమించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ తిరిగి ఎన్డీయేలోకి చేరాలనే ఆలోచనలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని పదవిని చేపట్టాలనే ఆకాంక్ష చంద్రబాబుకు లేదని వెల్లడించాయి. ఐదేళ్ల క్రితం మోడీ సర్కారుకు గుడ్‌ బై చెప్పినప్పుడు ఆ చర్య ఆంధ్రప్రదేశ్‌లో తనకు రాజకీయంగా ఉపకరిస్తుందని చంద్రబాబు భావించారు. కానీ అలా జరగలేదు. చంద్రబాబు ఇటీవల ఢిల్లిdలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాను కలుసుకున్నారని సమాచారం. ఈ ఏడాది అసెంబ్లిdకి జరిగే ఎన్నికల్లోనూ, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో నూ తెలంగాణలో పొత్తు కుదుర్చుకోవడంపై నడ్డా, షాలతో టీడీపీ అధినేత చర్చించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అకాలీదళ్‌కు ఆహ్వానాలు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 2020లో ఎన్డీయేను వీడిన అకాలీదళ్‌ను కూడా ఎన్డీయేలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ, అకాలీదళ్‌ పార్టీలు ఎన్‌డీయే వ్యవస్థాక సభ్యులు కావడం విశేషం. మరోవైపు కర్నాటకలో జేడీఎస్‌ సైతం కాషాయదళంలో చేరుతుందనే మాట కన్నడ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తమ్మీద కేంద్రంలో పదేళ్ళు అధికారం వెలగబెట్టిన యూపీఏ ఊసెత్తుకుండా విపక్షాలతో నితీశ్‌ కుమార్‌, ఒకపక్క అమెరికా పర్యటనకు సన్నాహాలు చేసుకుంటూనే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మోడీ చెరో కూటమి కట్టడానికి చేస్తున్న ప్రయత్నాలతో రానున్న ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయనేది రాజకీయ పండితుల అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement